close

తాజా వార్తలు

Published : 18/09/2020 12:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. రష్యా టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌..?

కరోనా వైరస్‌ కట్టడికి రష్యా తయారుచేసిన స్పుత్నిక్‌-వి టీకా ప్రయోగాల్లో పాల్గొన్న ప్రతి ఏడుగురు వాలెంటీర్లలో ఒకరికి సైడ్‌ఎఫెక్ట్స్‌ వస్తున్నట్టు తెలిసింది. ఈ టీకా‌ ప్రయోగించిన వారిలో 14 శాతం మందిలో ఈ లక్షణాలు కనిపించినట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్‌ మురాష్కో తెలిపారు. అయితే, ఆ లక్షణాలు మర్నాటి కల్లా సర్దుకున్నాయని ఆయన వివరించారు. స్పుత్నిక్-వి‌ టీకా తీసుకున్న అనంతరం సగటున ఏడుగురిలో ఒకరికి బలహీనత, ఒంటినొప్పులు వంటి లక్షణాలు కనిపించాయని ఆయన వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. బంతి చైనా కోర్టులోనే ఉంది!

లద్దాఖ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చే దిశగా చైనా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. బలగాల ఉపసంహరణకు ఏమాత్రం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. పైగా మాస్కోలో ఇటీవల ఇరు దేశాల విదేశాంగ మంత్రుల భేటీలో కుదిరిన ఒప్పందాలను అమలు చేయడంలో చోటుచేసుకుంటున్న జాప్యాన్ని భారత్‌పైకి నెట్టే ప్రయత్నం చేస్తోంది. చైనా కుయుక్తులను భారత్‌ దీటుగా తిప్పికొట్టింది. ఉద్రిక్తతల తగ్గింపు విషయంలో చైనా నిజాయతీగా వ్యవహరించాలని హితవు పలికింది. ఏకపక్షంగా సరిహద్దుల్ని మార్చే ప్రయత్నం చేయొద్దని తేల్చి చెప్పింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘ఏపీ మంత్రి కుమారుడికి బెంజికారు లంచం’

ఏపీ కార్మికశాఖమంత్రి గుమ్మనూరు జయరాం కుమారుడు ఈశ్వర్‌కు ఓ కేసులో ఏ14 నిందితుడిగా ఉన్న వ్యక్తి బెంజికారు బహుమతిగా ఇచ్చారని తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. విశాఖలోని తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన్నపాత్రుడు మాట్లాడుతూ... మంత్రి జయరాంకు ఏ14గా ఉన్న వ్యక్తి బినామీ అని పేర్కొన్నారు. మంత్రికి బినామీ కాబట్టే ఆయన కుమారుడికి ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చారని విమర్శించారు. ‘మంత్రి కుమారుడికి ఇచ్చింది పుట్టినరోజు కానుక కాదు.. లంచం’ అని ఆరోపించారు. ఓ ముద్దాయికీ మంత్రి జయరాం కుమారుడికి సంబంధమేంటని ఆయన ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రికవరీల్లో రికార్డ్‌: ఒక్కరోజే 87వేల మంది డిశ్చార్జ్‌!

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం 95వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 10,06,615 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా వీటిలో 96,424 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో శుక్రవారం నాటికి దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 52,14,677కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కోలుకుంటున్న వారిసంఖ్య కూడా ఎక్కువగా ఉండటం ఊరటకలిగించే విషయం. దేశంలో వైరస్‌ సోకినవారిలో ఇప్పటికే 41లక్షల మంది కోలుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కొవిడ్‌ టీకా‌: రహస్య‌ సమాచారం విడుదల!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ కోసం ముమ్మర కృషి జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో సంస్థల మధ్య పోటీ, టీకా‌ ప్రయోగాలు త్వరితగతిన పూర్తి చేస్తామనే ప్రకటనలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా వ్యాక్సిన్‌ ప్రయోగాలు శాస్త్రీయంగా జరుగుతున్నాయా? లేదా? అనే విషయంపై అనుమానాలు రేకెత్తాయి. దీంతో ఇలాంటి అనుమానాలకు స్వస్తి చెప్పేందుకు టీకా‌ తయారీ సంస్థలు ముందుకొచ్చాయి. దీనిలోభాగంగా వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రణాళిక(బ్లూప్రింట్‌)ను మోడెర్నా, ఫైజర్‌ కంపెనీలు బహిర్గతం చేశాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కౌర్‌ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యవసాయ రంగ బిల్లుల్ని వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి పదవికి అకాలీదళ్‌ నేత హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ చేసిన రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదించారు. ప్రధాని సూచన మేరకు ఆమె రాజీనామాకు ఆమోదం తెలిపినట్లు రాష్ట్రపతి భవన్‌ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు ఆమె నిర్వహించిన ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ బాధ్యతలను ప్రధాని సిఫార్సుల మేరకు మరో మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కు అప్పగించారు. ఇప్పటికే తోమర్‌ వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భారత్‌లో ఆపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌ ఎప్పుడంటే?

అమెరికా టెక్‌ దిగ్గజ కంపెనీ ఆపిల్‍ భారత్‌లో ఐఫోన్‌ ప్రియులకు శుభవార్త చెప్పింది. తాము త్వరలో ఆపిల్‌ తొలి ఆన్‌లైన్‌ స్టోర్‌ను భారత్‌లో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ ట్విటర్లో ప్రకటించారు. తద్వారా భారత్‌లో తమ కస్టమర్లకు మరింత చేరువవుతున్నట్టు తెలిపారు. ‘‘తమకు ఇష్టమైన వారితో, చుట్టు ఉన్న ప్రపంచంతో సన్నిహితంగా ఉండటం వినియోగదారులకు ఎంత ముఖ్యమో మాకు తెలుసు. అందుకే మా కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు, వారికి సేవలందించేందుకు మేం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. ఇందు కోసం సెప్టెంబర్‌ 23న భారత్‌లో మా కంపెనీ తొలి ఆన్‌లైన్‌ స్టోర్‌ను ప్రారంభించనున్నాం’’ అని టిమ్‌ కుక్‌ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మోదీకి బర్త్‌డే గిఫ్ట్‌గా ఇవి కావాలట!

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఎలాంటి బహుమతి కావాలని ఎంతోమంది అభిమానులు అడిగారు. దీనిపై స్పందించిన మోదీ తనకు సురక్షితమైన భూమి కావాలని కోరుకున్నారు. ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలని అదే తనకు పుట్టిన రోజు కానుక అని అన్నారు. ప్రధాని గురువారం 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కంగన..నీవుండగా దేశాన్ని టచ్‌ చేయలేరు

సోషల్‌మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను వెల్లడిస్తూ వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నారు బాలీవుడ్ నటి కంగన రనౌత్‌. మహారాష్ట్ర ప్రభుత్వం, బీటౌన్‌పై ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు సైతం కంగనపై ఫైర్‌ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె పెట్టిన ఓ ట్వీట్‌పై దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ వ్యంగ్యంగా స్పందించారు. ‘నేను ఒక పోరాట యోధురాలిని. కావాలనుకుంటే ప్రాణత్యాగం చేస్తాను. వేరొకరికి తలవంచను. దేశ గౌరవం కాపాడేందుకు తరచూ నా స్వరాన్ని వినిపిస్తుంటాను. మర్యాద, ఆత్మగౌరవంతో ఒక జాతీయవాదిగా జీవిస్తుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ విలువల విషయంలో రాజీపడను.. పడబోను. జైహింద్‌’ అని కంగన చేసిన ట్వీట్‌పై అనురాగ్‌ వ్యంగ్యంగా స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. IPL: ఏ జట్టు హై స్కోర్‌ ఎంతో తెలుసా?

పొట్టి క్రికెట్‌కు మరోపేరు ‘పరుగుల పండుగ’. ఎందుకంటే క్రీజులోకి వచ్చిన మరుక్షణం నుంచే బ్యాటర్లు విజృంభించేస్తారు. కళ్లు చెదిరే సిక్సర్లు.. కమనీయమైన బౌండరీలతో అలరిస్తారు. పవర్‌ప్లేలోనే 70-80 పరుగులు ఖాతాలో జమ చేసేస్తారు. ఆట పూర్తయ్యే వరకూ అదే జోరు కొనసాగిస్తే స్కోరు 220 దాటడం ఖాయమే. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అన్ని జట్లూ ఈ మైలురాయిని అందుకున్నాయి. మరికొన్ని గంటల్లో 2020 సీజన్‌ మొదలవుతోంది. మరి ఏ జట్టు అత్యధిక స్కోరు ఎంతో తెలుసుకుందామా! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.