close

తాజా వార్తలు

Published : 20/10/2020 12:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. హైదరాబాద్‌లో మళ్లీ వర్షం

భాగ్యనగరంపై వరుణిడి ప్రతాపం కొనసాగుతోంది. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం 12గంటలకు మళ్లీ వర్షం పడటంతో హైదరాబాద్‌ వాసులు బెంబేలెత్తుతున్నారు. వర్షం, వరదల కారణంగా హైదరాబాద్‌ అతలాకుతలమయింది. దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేట, చంపాపేట్‌, కుషాయిగూడ, నాగారం, దమ్మాయిగూడ, చర్లపల్లి, మల్కాజ్‌గిరి, మలక్‌పేట్‌, ఏఎస్‌రావు నగర్‌, కీసర, తార్నాక, లాలాపేట్‌, ఓయూ క్యాంపస్‌, హబ్సిగూడ, మల్లాపూర్‌, నాచారం తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

హైదరాబాద్‌ను వెంటాడుతున్న వరద కష్టాలు

2. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్జీటీ తీర్పు

కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగాయని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంగళవారం తీర్పు వెల్లడించిన ఎన్జీటీ పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగినట్టు గుర్తించామని తెలిపింది. ప్రాజెక్టు పూర్తయినందున ఉపశమన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని పేర్కొంది. తాగునీటి ప్రాజెక్టు పేరుతో సాగు అవసరాలకు కూడా రూపకల్పన చేశారన్న ఎన్జీటీ.. వాటిని పరిగణనలోకి తీసుకోవడంలో కేంద్ర పర్యావరణశాఖ విఫలమైందని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ప్రతి ఒక్కరికీ సాయం అందాలి: కేటీఆర్‌

వరద సహాయక చర్యలపై తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. గ్రేటర్‌ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ... రానున్న పది రోజులపాటు ప్రతి ఎమ్మెల్యే వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు పర్యవేక్షించాలని సూచించారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికీ సీఎం ప్రకటించిన తక్షణ సాయం అందేలా చూడాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. దేశంలో కొత్తగా 46,791 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే గత కొన్ని రోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుండటం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. సోమవారం 10,32,795 నమూనాలను పరీక్షించగా 46,791 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 75,97,064కు చేరింది. గడిచిన మూడు నెలల్లో 50,000 లోపు కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గడిచిన 24 గంటల్లో 587 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,15,197గా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణలో కొత్తగా 1,486 కరోనా కేసులు

5. హెచ్‌-1బీపై ఆంక్షలతో అమెరికాకే ఆర్థిక ముప్పు..!

 హెచ్‌-1బీ వీసా విధానాన్ని మరింత కఠినతరం చేస్తూ ఇటీవల అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అక్కడి పలు వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. కొత్త విధానం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర హాని కలుగుతుందని హెచ్చరించాయి. హెచ్‌-1బీ వీసాల జారీపై అదనపు ఆంక్షలు విధిస్తూ ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంలాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌)’ ఇటీవల ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మోహినీ అవతారంలో వేంకటేశ్వరుడు

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. క్షీరసాగర మధనంలో స్వామివారు మోహినిగా ఉద్భవించినట్టు భక్తుల ప్రతీతి. అర్చకులు, జీయంగార్లు వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అన్నపూర్ణాదేవిగా బెజవాడ దుర్గమ్మ

7. ఫౌచీపై నోరు పారేసుకున్న ట్రంప్‌

అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోరుపారేసుకున్నారు. దేశంలో కరోనా వైరస్‌ కట్టడి విషయంలో ట్రంప్‌  విధానాల్లో లోపాలను నిర్మోహమాటంగా చెప్పే ఫౌచీ తీరు అధ్యక్షుడికి కంటగింపుగా మారింది. మాస్కుల వాడకంపై నిర్లక్ష్యం, అలాగే కొవిడ్ చికిత్స అనంతరం కరోనా నెగిటివ్ అని తేలకముందే శ్వేత సౌధానికి వచ్చి మాస్క్‌ను పక్కనపెట్టేయడం.. ఇలా అధ్యక్షుడి ప్రతి చర్యను ఫౌచీ తప్పుపడుతూనే ఉన్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘ఆమె పేరు గుర్తుకురాకే అలా అన్నాను’

 ఓ మహిళా మంత్రిని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగడంతో మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ అభ్యర్థి కమల్‌నాథ్‌ వివరణ ఇచ్చారు. తాను ఎవరినీ కించపరచాలనుకోలేదని తెలిపారు. అభ్యర్థి పేరు గుర్తు రాకపోవడంతో  ‘ఐటం’ అనే పదం వాడాల్సి వచ్చిందన్నారు. ‘‘నేను ఓ మాట అన్నాను. అది ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో వాడలేదు. నాకు ఆ వ్యక్తి పేరు గుర్తుకురాలేదు. ఈ జాబితాలో (చేతిలో ఉన్న ఓ పత్రాన్ని చూపుతూ) ఐటం నెం.1, ఐటం నెం.2 అని ఉంది. అది అవమానించినట్లా?’’ అంటూ తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఎముక పుష్టిగా.. !

శరీరాన్ని నిలబెట్టేవి ఎముకలే. ఇవి బలంగా ఉంటేనే నిటారుగా నిలుస్తాం. ఎంత దూరమైనా వేగంగా నడిచేస్తాం. పెద్ద బరువులనైనా అలవోకగా ఎత్తేస్తాం. అదే ఎముకలు బలహీనపడితే? లోపలంతా చెదలు పట్టినట్టుగా బోలుబోలుగా అయిపోతే? చిన్నపాటి కుదుపులకే పుటుక్కున విరిగిపోతాయి. సరిగా అతుక్కోవు కూడా. ఆస్టియోపొరోసిస్‌ ఇలాంటి చిక్కులే తెచ్చిపెడుతుంది. ఆస్టియోపొరోసిస్‌ ‘అదృశ్య’ సమస్య. తొలిసారి ఎముక విరిగేంతవరకూ ఎలాంటి లక్షణాలూ కనిపించవు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. చెన్నై ఓటములకు కారణాలివే..!

‘‘అరెరే.. మన చెన్నై జట్టుకు ఏమైంది..? ఎందుకిలా ఢీలా పడిపోయింది. ఇప్పుడున్న ధోనీసేన.. గతంలోని ఛాంపియన్‌ జట్టేనా..? ధోనీని.. చెన్నై జట్టును ఇలా చూడటం చాలా బాధగా ఉంది. ‘2020’ నిజంగానే చెడ్డది’’ ప్రస్తుత సీజన్‌లో ధోనీసేన పరిస్థితి చూశాక బహుశా సగటు చెన్నై అభిమాని ఆవేదన ఇదే కావచ్చు. గతంలో.. చెన్నై జట్టు ముందు కొండంత లక్ష్యం ఉన్నా ఛేదిస్తుందనే ధైర్యం ఉండేది. కారణం.. రైనా. అతను లేక ఇప్పుడు ఛేదనలో చతికలపడిపోతోంది. చేజారిపోతున్న మ్యాచ్‌లనూ చేజిక్కించుకుంటుందనే ధీమా ఉండేది. కారణం.. బ్రావో. అతను లేక ఇప్పుడు చేతిలోని మ్యాచ్‌లను ప్రత్యర్థులు లాగేసుకుంటున్నా నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.