close

తాజా వార్తలు

Published : 29/10/2020 12:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. హెచ్‌-1బీ లాటరీ పద్ధతికి ట్రంప్‌ స్వస్తి!

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌-1బీ వీసాల జారీలో ప్రస్తుతమున్న కంప్యూటరైజ్డ్‌ లాటరీ పద్ధతిని రద్దు చేసేందుకు ట్రంప్‌ పాలక వర్గం ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ మేరకు ఫెడరల్‌ రిజిస్టర్‌లో నోటిఫికేషన్‌ పెట్టింది. ఈ నోటిఫికేషన్‌పై 30 రోజుల్లోగా స్పందనలు తెలియజేయొచ్చని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంలాండ్‌ సెక్యూరిటీ(డీహెచ్‌ఎస్‌) వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పాక్‌ ఆర్మీ జనరల్‌ వణికిన వేళ..

పాక్‌తో వైమానిక పోరులో శత్రువులను తరిమికొట్టిన భారతీయ వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ విషయంలో ఆ దేశ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జావేద్‌ బాజ్వా గజగజ వణికారట. ఈ విషయాన్ని ఆ దేశ పార్లమెంటు సభ్యుడు ఒకరు స్వయంగా వెల్లడించారు. వర్థమాన్‌ను విడుదల చేయకపోతే భారత్‌ తమపై దాడిచేయనుందని నాటి ఓ అత్యున్నత సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రి షా మెహ్‌మూద్‌ వెల్లడించారట. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ తీర్పు

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందేనని ఎన్జీటీ చెన్నై ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకెళ్లవద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రాజెక్టు డీపీఆర్‌ సమర్పించి పర్యావరణ అనుమతులు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. తాగునీటితో పాటు సాగునీటి అవసరాలు ఉన్నాయని అభిప్రాయపడిన ఎన్జీటీ ..ప్రాజెక్టుపై ముందుకెళ్లవద్దని కేంద్ర జలశక్తి శాఖ లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రైతు వేదికల ప్రారంభానికి ముహూర్తం ఖరారు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు వేదికల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఈనెల 31న మధ్యాహ్నం 12.30గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు వేదికను ప్రారంభించనున్నారు. ఈసందర్భంగా రైతులు, ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. రైతు వేదిక ఏర్పాటు ఉద్దేశం, ఆవశ్యకత, వాటి ద్వారా జరిగే కార్యకలాపాలను సీఎం వివరిస్తారు. అంనతరం రైతు వేదిక సమీపంలోని పల్లె ప్రకృతి వనాన్ని కూడా సీఎం సందర్శించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భారత్‌లో 90.99 శాతం రికవరీ

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే రికవరీ రేటు పెరుగుతుండటం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. మరోవైపు మొత్తం కేసుల సంఖ్య 80 లక్షల 40 వేలు దాటిపోయింది. బుధవారం  10,75,760 నమూనాలను పరీక్షించగా 49,881 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 80,40,203 నమోదైంది. గడిచిన 24 గంటల్లో 517 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,20,527కి చేరింది. నిన్న దేశ వ్యాప్తంగా 56,480 మంది డిశ్ఛార్జి కాగా.. ఇప్పటి వరకూ 73,15,989 మంది కోలుకున్నట్లు  కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పెళ్లి సందడి హీరోయిన్‌ ఈమేనా..?

శ్రీకాంత్‌ కథానాయకుడిగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘పెళ్లి సందడి’. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం సినీ ప్రియుల హృదయాలను కొల్లగొట్టి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు 24 సంవత్సరాల తర్వాత ‘పెళ్లి సందడి’ పేరుతో ఓ చిత్రాన్ని రానున్నట్లు ఇటీవల దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో కథానాయకుడిగా శ్రీకాంత్‌-ఉహల తనయుడు రోషన్ నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇందులో రోషన్‌కు జంటగా మాళవికా నాయర్‌ సందడి చేయనున్నారని తాజాగా వార్తలు వస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అమెరికా ముందస్తు గోల!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గటానికి ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నాయి రిపబ్లికన్, డెమొక్రాటిక్‌ పార్టీలు! తాజాగా... ముందస్తు ఓటింగ్‌కు వీలుకల్పించిన పోస్టల్‌ బ్యాలెట్లపై రెండు పార్టీల మధ్యా ఒకరకంగా యుద్ధం సాగుతోంది! గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి పోస్టల్‌ బ్యాలెట్ల ద్వారా ఓటింగ్‌ నమోదవుతోంది! అధికారికంగా నవంబరు 3న అధ్యక్ష ఎన్నికకు పోలింగ్‌ అయినప్పటికీ... ఇప్పటికే అనేక రాష్ట్రాలో మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్‌ (పోస్టల్‌/ఆబ్సెంటీ ఓటింగ్‌) ద్వారా పోలింగ్‌ సాగుతోంది! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆవుతో హగ్‌.. ఒత్తిడికి కొత్త మందు!

భారతీయులు ఆవును తల్లిలా భావించి పూజిస్తుంటారు. గోమాత ఇంట్లో ఉన్నా.. గోశాలకు వెళ్లి వాటిని పూజించినా సుఖ శాంతులు దక్కుతాయని నమ్ముతారు. అయితే ఆధునిక కాలంలో వీటిని చాలా మంది కొట్టిపారేస్తుంటారు. ఆవును కేవలం పాలిచ్చే జంతువుగానే పరిగణిస్తారు. కానీ, ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. ఆవుల వల్ల మనిషికి మానసిక ప్రశాంతత లభిస్తుందని పరిశోధకులు చెబుతుండటమే ఇందుకు కారణం. దీంతో ప్రస్తుతం ఆవులను ఆలింగనం చేసుకోవడానికి ప్రజలు క్యూ కడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అల్లుడిని హతమార్చిన అత్త

హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. అల్లుడు నవీన్‌ను అత్త అనిత కత్తితో పొడిచి చంపింది. పోలీసుల కథనం ప్రకారం... ఆరు నెలల క్రితం అనిత తన కుమార్తెకు నవీన్‌తో వివాహం జరిపించింది. పెళ్లయిన నెలకే అనిత కుమార్తె ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో నవీన్‌పై అనిత కేసు పెట్టింది. ఈ కేసు కొనసాగుతుండగానే ఇవాళ నవీన్‌ హత్యకు గురయ్యాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సూర్యకుమార్‌ ఎంపికపై మాటల యుద్ధం

ఆస్ట్రేలియా పర్యటనకు భారత క్రికెట్‌ జట్ల ఎంపికపై దుమారం రేగుతోంది. సునీల్‌ జోషి సారథ్యంలోని సెలెక్షన్‌ కమిటీపై మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆటగాళ్ల ఎంపికకు పాటించిన ప్రమాణాలపై ఒకరు.. ఐపీఎల్‌ ప్రదర్శనను టెస్టులకు ఎలా పరిగణిస్తారని మరొకరు..ప్రతిభావంతుడి సెలెక్షన్‌ తప్పుబట్టడం సరికాదంటూ ఇంకొకరు మాటలు దూశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* సూర్యకుమార్‌పై కోహ్లీకి ఇంత ద్వేషమా?


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.