close

తాజా వార్తలు

Published : 31/10/2020 12:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. ‘చలో గుంటూరు జైలు’ ఉద్రిక్తం

అమరావతి రైతులను అరెస్టు చేసి వారికి సంకెళ్లు వేసి తరలించినందుకు నిరసనగా చలో గుంటూరు జైలుకు పిలుపునిచ్చిన రాజధాని ఎస్సీ ఐకాస, అమరావతి పరిరక్షణ సమితి నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. రైతులను రిమాండ్‌లో ఉంచిన  జైలు వద్ద ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు పరిసరాల్లోకి ఎవరూ రాకుండా ఆంక్షలు విధించారు. జైలు బయట బస్టాండ్‌లో ఉన్నవారిని ఎప్పటికప్పుడు పంపించేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ప్రశ్నించే గొంతు నొక్కేస్తున్నారు: యనమల

2. ఆనాడు పుల్వామాపై రాజకీయం చేశారే..

గతేడాది జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై జరిగిన ఉగ్రదాడి సమయంలో ప్రతిపక్ష పార్టీలు దారుణంగా వ్యవహరించాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. యావత్‌ భారతావని తమ బిడ్డల్ని కోల్పోయామన్న వేదనలో ఉంటే.. కొందరు మాత్రం ఎలాంటి బాధ లేకుండా తమ స్వార్థ ప్రయోజనాలను చూసుకున్నారని ప్రతిపక్షాలనుద్దేశిస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు పుల్వామా దాడి చేసింది తామేనంటూ పాకిస్థాన్‌ అంగీకరించడంతో అలాంటి వారి నిజస్వరూపం బయటపడిందని దుయ్యబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. దేశ విమానయాన చరిత్రలో తొలి మహిళా సీఈవో

భారత విమానయాన చరిత్రలో తొలిసారి ఓ మహిళా అధికారి దేశీయ విమానయాన సంస్థ పగ్గాలు చేపట్టనున్నారు. ఎయిరిండియా(ఏఐ) ప్రాంతీయ అనుబంధ సంస్థ అయిన అలయన్స్‌ ఎయిర్‌కు కెప్టెన్‌ హర్‌ప్రీత్‌ సింగ్‌ను సీఈవోగా నియమిస్తూ ఎయిరిండియా సీఎండీ రాజీవ్‌ భన్సల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈమె ఆ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం హర్‌ప్రీత్‌ సింగ్‌ ఎయిరిండియా ఫ్లైట్‌ సేఫ్టీ విభాగంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. దేశంలో 91శాతానికి పెరిగిన రికవరీలు 

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ మళ్లీ విజృంభిస్తుండటం ఆందోళనకరంగా మారగా.. భారత్‌లో మాత్రం క్రియాశీల కేసులు తగ్గుముఖం పట్టడం ఊరట కలిగిస్తోంది. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకీ తగ్గుతూ 6లక్షల దిగువకు చేరింది. ప్రస్తుతం మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 5,82,649కి చేరగా.. ఈ రేటు 7.16శాతానికి తగ్గింది. ఇక రికవరీ రేటు 91.34శాతానికి పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణలో కొత్తగా 1,445 కరోనా కేసులు

5. భలే ఐడియా బాసూ! అద్దెకు అదిరిపోయే చెక్‌!

సొంత ఊరు వదిలి, పట్టణాలకు వచ్చి చాలీచాలని జీతానికి పనిచేస్తూ కాలం గడిపే బ్యాచిలర్‌ల బాధలు మాములుగా ఉండవు. కష్టపడి సంపాదించిన జీతంలో కొంత సొంత ఖర్చులకు పెట్టుకుని మిగతా డబ్బులు ఇంటికి పంపుదామంటే.. సింహభాగం అద్దెకే పోతుంది. ఇలాంటి సమస్యకు అదిరిపోయే రీతిలో చెక్‌ పెట్టాడు ఓ దిల్లీ కుర్రాడు. అతడి పేరే దిశాంత్‌. నిద్రపోవడానికి ఆరడుగుల స్థలం ఉంటే చాలు అపార్టుమెంట్‌లు దేనికీ అంటున్నాడు. అద్దెకు చెక్‌ పెట్టి ఆ డబ్బుతో ప్రపంచమంతా చుట్టేస్తున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఈ దీపావళికి కాంతులీనే కొత్త సినిమాలివే!

సరికొత్త చిత్రాలతో ఈ దీపావళి మరింత ప్రత్యేకం కాబోతోంది. ఒకప్పుడు పండగ సెలవులు వస్తే థియేటర్ల వైపు చూసే వాళ్లం. కరోనా వల్ల థియేటర్లు మూతపడటంతో పెద్ద ప్రాజెక్టులను సైతం ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులతో ఇంట్లోనే కూర్చొని ఇష్టమైన సినిమా చూసే వెసులుబాటు లభించింది. ఈ దీపావళికి అక్షయ్‌ కుమార్‌ ‘లక్ష్మీ’, సూర్య ‘ఆకాశం నీ హద్దురా!’, కీర్తి సురేశ్‌ ‘మిస్‌ ఇండియా’ తదితర సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. నవంబరులో మనల్ని అలరించడానికి సిద్ధమైన సినిమాల జాబితా చూద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. హైదరాబాద్‌లో వరద బాధితుల ఆందోళన

వరద బాధితులకు ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయం అందడం లేదని హైదరాబాద్‌లోని పలు చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉప్పల్‌ జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున బాధితులు ఆందోళన చేపట్టారు. అధికార పార్టీకి చెందిన కార్యకర్తలకే డబ్బులు ఇస్తున్నారని, అసలైన బాధితులకు సాయం అందడం లేదని వాపోయారు. భారీగా అక్కడికి చేరుకున్న బాధితులు జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వ్యాధుల భయం వెంటాడుతోందా?

ఓ వైపు దేశంలో కరోనా అలజడి కొనసాగుతోంది. మరోవైపు శీతాకాలం సమీపిస్తుండటంతో కరోనా వేగంగా వ్యాపించే అవకాశముందని, అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునే ఆహారం తినాలని సూచిస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి వృద్ధి చెందకపోతే ఫలితం శూన్యం. అందువల్ల వ్యాధుల బారి నుంచి రక్షించుకోవడానికి వీలుగా కొన్ని రకాల సీజనల్‌ ఫ్రూట్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో చూసేద్దామా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కాజల్‌ పెళ్లి ఫొటోలు చూశారా..!

నటి కాజల్‌ అగర్వాల్‌ రాకుమారిగా సిద్ధమై.. పెద్దల సమక్షంలో తన కలల రాకుమారుడు గౌతమ్‌ కిచ్లును వివాహమాడారు. ‘మిత్రవింద’గా తెలుగు వారి హృదయాలను దోచుకున్న ఈ ముంబయి ముద్దుగుమ్మ తాజాగా తన సింగిల్‌ లైఫ్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టేసి.. గౌతమ్‌తో న్యూజర్నీని ప్రారంభించారు. అతి తక్కువమంది అతిథుల సమక్షంలో వీరిద్దరి వివాహం శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కాజల్‌ వివాహానికి సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రోహిత్‌×కోహ్లీ: నిజంగానే అంత చెడిందా?

విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ.. టీమ్‌ఇండియాకు రెండు కళ్లు. ప్రతిభాపాటవాల్లో, జట్టును నడిపించడంలో ఎవరికి వారే సాటి. అంతర్జాతీయ వేదికపై భారత జట్టు అఖండ విజయాలు అందుకోవాలన్నా.. ఐసీసీ ట్రోఫీల్ని ముద్దాడాలన్నా వీరిద్దరూ సమన్వయంతో పనిచేయడం అత్యంత అవసరం. ఒకరికొకరు సహకరించుకోవడం మరెంతో కీలకం. కానీ.. మళ్లీ వీరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయన్న వార్తలు కలవరపెడుతున్నాయి. జట్టు భవితవ్యాన్ని ఆందోళనకరంగా మార్చేస్తున్నాయి. ఇంతకీ ఈ సమస్యకు పరిష్కారమేంటి? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

99 వద్ద ఔటైన గేల్‌కు జరిమానా


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.