అమెరికాలోనూ టిక్‌టాక్‌పై నిషేధం?
close

తాజా వార్తలు

Published : 01/08/2020 10:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెరికాలోనూ టిక్‌టాక్‌పై నిషేధం?

వాషింగ్టన్‌: ఇప్పటికే భారత్‌లో నిషేధానికి గురైన టిక్‌టాక్‌పై అమెరికాలోనూ కత్తి వేలాడుతోంది. అక్కడా ఈ యాప్‌ను నిషేధించేందుకు యోచిస్తున్నట్లు స్వయంగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ‘‘టిక్‌టాక్‌ (నిషేధం)అంశాన్ని పరిశీలిస్తున్నాం. మేం దాన్ని నిషేధించవచ్చు. లేదా ఇంకా ఇతర చర్యలేమైనా తీసుకోవచ్చు. మా ముందు కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఈ విషయంలో చాలా జరుగుతున్నాయి. చూద్దాం ఏమౌతుందో’’ అని శ్వేతసౌధంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. 

మరోవైపు టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాల్ని విక్రయించాల్సిందిగా దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌‌ను ఆదేశించేందుకు ట్రంప్‌ పాలకవర్గం సిద్ధమవుతున్నట్లు ప్రముఖ మీడియా సంస్థలు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌, బ్లూమ్‌బెర్గ్‌ కథనాలు ప్రచురించాయి. ఈ వార్తపై విస్తృత స్థాయిలో చర్చ జరుగుతున్న తరుణంలోనే ట్రంప్‌ పై వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు టిక్‌టాక్‌ని ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాప్ట్‌ కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు బైట్‌డ్యాన్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే, దీనిపై ఇటు మైక్రోసాఫ్ట్‌ నుంచి కానీ, అటు బైట్‌డ్యాన్స్‌ నుంచి కానీ ఎటువంటి అధికారిక సమాచారం లేదు. 

భారత్‌లో టిక్‌టాక్‌ను నిషేధించడాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో సహా పలువురు సీనియర్‌ చట్టసభ ప్రతినిధులు సమర్థించిన విషయం తెలిసిందే. ఈ యాప్‌ వల్ల అమెరికా భద్రతకు ముప్పు పొంచి ఉందని ఇటీవల అక్కడి కాంగ్రెస్‌ సభ్యులు ఆరోపించారు. వీటి ద్వారా అమెరికా పౌరుల సమాచారం చైనాకు చేరుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు తెలుస్తోంది. చైనా మూలాలున్న మరికొన్ని యాప్‌లపైనా భారత్‌ తరహాలో నిషేధం విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని