
తాజా వార్తలు
జూనియర్ ట్రంప్‌నకు కరోనా పాజిటివ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయనలో ఎలాంటి లక్షణాలు లేవని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. క్వారంటైన్లో ఉన్న ఆయన అన్ని కొవిడ్-19 నిబంధనల్ని పాటిస్తున్నారని చెప్పారు. అధ్యక్షుడు ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ సహా వారి సంతానం బారెన్ ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. తండ్రి తరఫున జూనియర్ ట్రంప్ తాజాగా ముగిసిన అధ్యక్ష ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేశారు. ఎన్నికల రోజు సాయంత్రం జరిగిన ఓ ప్రైవేటు విందులో పాల్గొన్న ఆయన మాస్క్ ధరించలేదు. ఆ కార్యక్రమంలో దాదాపు 250 మంది ఎలాంటి కొవిడ్ నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
వీరితో పాటు శ్వేతసౌధంలో పలువురు ఉన్నతాధికారులు వైరస్ బారిన పడ్డారు. శుక్రవారం ఆండ్రూ జ్యులియాని అనే ఓ ఉన్నతాధికారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈయన తండ్రి రూడీ జ్యులియాని ట్రంప్‌నకు వ్యక్తిగత న్యాయవాదిగా పనిచేస్తున్నారు. కరోనా కట్టడి విషయంలో ట్రంప్ పాలకవర్గం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.