ఉగ్రవాదులు ఆ సొరంగం నుంచే వచ్చారా?
close

తాజా వార్తలు

Published : 23/11/2020 00:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉగ్రవాదులు ఆ సొరంగం నుంచే వచ్చారా?

జమ్ము: జమ్ము కశ్మీర్‌ సాంబ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఓ రహస్య సొరంగమార్గాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. ఇటీవల నగ్రోటా ఎన్‌కౌంటర్‌లో హతమైన నలుగురు జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు దీని ద్వారానే పాకిస్థాన్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించి ఉంటారని అనుమానిస్తున్నారు. నేరుగా భారత్‌లోకి ప్రవేశించే వీలు లేకపోవడంతో ఉగ్రవాదులు రహస్య మార్గాలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ  ఓ సొరంగ మార్గాన్ని భద్రతాదళాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో భారత బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇంకా ఇలాంటి మార్గాలేమైనా ఉన్నాయా అనే కోణంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.

జమ్ము-శ్రీనగర్‌ జాతీయరహదారిపై గురువారం నగ్రోటా టోల్‌ప్లాజా వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమైన సంగతి తెలిసిందే. ఎన్‌కౌంటర్‌ ప్రదేశం నుంచి భారీ స్థాయిలో తుపాకులు, మందుగుండు సామగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఉగ్రవాదులు భారత్‌లో ముంబయి పేలుళ్ల తరహా భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా.. ఉగ్రవాదులు ఉపయోగించిన వైర్‌లెస్‌ సెట్‌, ఇతర ఆయుధాలు పాక్‌లో తయారైనవని దర్యాప్తులో తేలినట్లు తెలిసింది. ఈ ఉగ్రవాద చర్యను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. దీనిపై భారత విదేశాంగశాఖ పాకిస్థాన్‌ హై కమిషనర్‌కు సమన్లు కూడా జారీ చేసింది. పాక్‌ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇకనైనా దాయాది దేశం ఉగ్రవాదులకు మద్దతివ్వడాన్ని, వారికి ఆశ్రయం కల్పించడాన్ని మానుకోవాలని డిమాండ్‌ చేసింది. దాడుల కోసం ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేసి భారత్‌ను అస్థిర పరచేందుకు పాక్‌ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని