
తాజా వార్తలు
విషాదం నింపిన క్రికెట్ బెట్టింగ్
ఇద్దరు యువకుల ఆత్మహత్య
బెల్లంకొండ: గుంటూరు జిల్లా బెల్లంకొండలో క్రికెట్ బెట్టింగ్ విషాదం నింపింది. క్రికెట్ బెట్టింగ్‌లో ఓడిపోయామనే బాధతో ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటైన కొమరయ్య, సురేశ్ బెట్టింగ్‌లో ఓడిపోయి లక్ష రూపాయల వరకు బాకీ పడ్డారు. డబ్బులు చెల్లించాలని నిర్వాహకుల నుంచి ఒత్తిడి రావడంతో ఈ నెల 9వ తేదీన సురేశ్, కొమరయ్య రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి పురుగులమందు తాగారు. చికిత్స పొందుతూ సురేశ్ ఈనెల 10వ తేదీన చనిపోగా.. కొమరయ్య ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించాడు. క్రికెట్ బెట్టింగే తమ పిల్లలను బలితీసుకుందని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
యువకుల ఆత్మహత్యకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. క్రికెట్ బుకీలు బాజి, తిరుపతిరావును అరెస్టు చేసి విచారిస్తున్నారు. మరికొందరి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.