అల్లాద్దీన్‌ దీపం పేరుతో రూ. 2.5 కోట్లకు టోకరా
close

తాజా వార్తలు

Published : 30/10/2020 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అల్లాద్దీన్‌ దీపం పేరుతో రూ. 2.5 కోట్లకు టోకరా

యూపీలో మోసపోయిన వైద్యుడు

 

మేరఠ్‌: అల్లాదీన్‌ దీపం పేరుతో ఓ వైద్యుడిని ఇద్దరు వ్యక్తులు మోసం చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మన దేశానికి చెందిన లయీక్‌ ఖాన్‌ అనే వ్యక్తి లండన్‌ నుంచి తిరిగొచ్చి యూపీలో వైద్యుడిగా సేవలందిస్తున్నారు. మాయలు, మంత్రాలు, తాంత్రిక శక్తుల పేరుతో ఇద్దరు వ్యక్తులు వైద్యుడికి దగ్గరయ్యారు. 2018 నుంచి ఈ వైద్యుడి దగ్గరికి ఓ మహిళ తన శస్త్రచికిత్సకు సంబంధించి తరచూ ఆరోగ్య పరీక్షలకు వస్తుండేవారు. ఆమె ద్వారా తాంత్రికుడి పేరుతో చలామణి అవుతున్న ఇస్లాముద్దీన్‌ అనే మరో వ్యక్తి కూడా వైద్యుడికి పరిచయం అయ్యాడు. తనకు తాంత్రిక శక్తులు ఉన్నట్లు అతను వైద్యుడిని నమ్మించాడు. తన వద్ద అలాద్దీన్‌ దీపం ఉందని.. దాని నుంచి బయటికి వచ్చే భూతం అద్భుతాలు చేస్తుంటుందని వైద్యుడికి వివరించారు. అప్పుడప్పుడు భూతం ఆకారాన్ని సైతం ఇస్లాముద్దిన్‌ వైద్యుడికి చూపించాడు.

ఈ దీపం దగ్గర ఉంటే కోటీశ్వరుడివి అవుతావని చెప్పి వైద్యుడికి దాన్ని రూ. 2.5 కోట్లకు విక్రయించాడు. ఈ డబ్బు మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లించిన వైద్యుడు ఆ దీపాన్ని తన ఇంటికి తీసుకెళ్తానని అడిగిన ప్రతిసారీ వాళ్లు అతడిని భయపెట్టేవాళ్లు. దీని నుంచి వచ్చే భూతం వల్ల చెడు జరుగుతుందని వైద్యుడిని చాలా సార్లు నమ్మించారు. దీంతో మోసపోయానని గ్రహించిన వైద్యుడు జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు. ఇస్లాముద్దిన్‌ అతని స్నేహితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు వాళ్లిద్దరినీ అరెస్టు చేశారు. భూతం ఆకారంలో కనిపించిన వ్యక్తి వైద్యుని వద్దకు ఆరోగ్య పరీక్షలకు వచ్చే మహిళ భర్తగా గుర్తించారు. వాళ్లను సైతం అదుపులోకి తీసుకునే పనిలో ఉన్నట్లు పోలీసులు వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని