
తాజా వార్తలు
నయా నిజాం ఆలోచనలు సాగనివ్వొద్దు: యోగి
హైదరాబాద్: దేశవ్యాప్తంగా మార్పు రావాల్సిన అవసరం ఉందని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఆర్టికల్ 370ని రద్దు చేసినట్లు చెప్పారు. 400 ఏళ్లకుపైగా కార్యరూపం దాల్చని అయోధ్య రామమందిర వివాదాన్ని పరిష్కరించుకొని.. ఆలయాన్ని ఇప్పుడు నిర్మించుకుంటున్నామన్నారు. హైదరాబాద్ కూకట్పల్లి నుంచి అల్విన్‌కాలనీ ప్రధాన కూడలి వరకు నిర్వహించిన రోడ్ షోలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. యూపీలో భాజపా 15 లక్షల ఇళ్లను ప్రజలకు ఇచ్చిందని.. మరి ఆరేళ్ల పాలనలో తెరాస ఎన్ని మంజూరు చేసిందో చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఆవాస్ యోజన కింద పేదలకు ఎందుకు ఇళ్లు కట్టలేదని ప్రశ్నించారు.
‘‘వరద బాధితులకు సాయం నేరుగా వారి ఖాతాల్లో ఎందుకు వేయలేదు? కార్యకర్తల కోసమే నగదు రూపంలో వరద సాయాన్ని పంపిణీ చేశారు. నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం సర్దార్ పటేల్‌తో సాకారమైంది. నిజాం రూపంలో వస్తున్న మరో నయా నిజాం ఆలోచనలను సాగనివ్వకూడదు. ఎంఐఎంతో కలిసి తెరాస ప్రభుత్వం నగరవాసులకు అన్యాయం చేస్తోంది. ఇక్కడే ఉంటారు.. ఇక్కడే తింటారు.. హిందుస్థాన్ అని అనమంటే అనరు. ఎంఐఎం బెదిరింపులు భరించాలా? మీతో కలిసి పోరాటం చేసేందుకు మీముందుకు వచ్చాను. హైదరాబాదీల ఉత్సాహం చూస్తే ఎంతో సంతోషంగా ఉంది. హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మార్చడంలో ప్రజలు సహకారం కావాలి. తండ్రి, కొడుకు కలిసి ప్రజల సొత్తును దొచుకుంటున్నారు. వ్యాపారులను భయపెడుతున్నారు. అభివృద్ధిపై దృష్టి సారించడం లేదు. భాగ్యనగర నిర్మాణం కోసం భాజపా కృషి చేస్తోంది. అవినీతి లేని హైదరాబాద్ కావాలంటే.. భాజపాకు ప్రజలు విజయాన్ని అందించాలి. భాజపాను గెలిపించి దిల్లీ నుంచి నేరుగా నిధులు తెప్పించుకోండి’’ అని యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు.