
తాజా వార్తలు
భారత్-అమెరికా మధ్యలో గూగుల్ ట్యాక్స్..!
వాణిజ్య సంబంధాల్లో మరో చిక్కుముడి
ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం
హెచ్1బీ వీసాలు.. వాణిజ్య లోటు.. జీఎస్పీ మినహాయింపు ఎత్తివేత.. ఇలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌ను వరుసగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. భౌగోళిక రాజకీయాల విషయంలో ఇరు దేశాలు వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నా.. వాణిజ్యం విషయంలో మాత్రం ట్రంప్ భారత్‌పై కత్తికట్టారు. ఇక్కడ పన్నులు ఎక్కువగా ఉంటాయని పలు మార్లు మన ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టే విమర్శించారు. ఇప్పుడు ఇరు దేశాల మధ్య మరో వివాదం తీవ్ర రూపం దాలుస్తోంది. ఇది ముదిరితే భారత్ వస్తువులపై అమెరికాలో పన్నుల భారం పెరిగే ప్రమాదం పొంచి ఉంది. ఇంతకీ ఆ వివాదం ఏమిటంటారా.. అదే గూగుల్ ట్యాక్స్..!
అసలు ఈ గూగుల్ ట్యాక్స్ ఏమిటీ..?
ఇటీవల భారత్ - అమెరికా మధ్య తరచూ వినిపిస్తున్న పేరు గూగుల్ ట్యాక్స్. ఇది దీని అసలు పేరు కాదు. అసలు పేరు ఈక్వలైజేషన్ ట్యాక్స్. 2016-17లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు. అదే ఏడాది జూన్ నుంచి అమల్లోకి తెచ్చారు. వాణిజ్య ప్రకటనలతో అత్యధిక ఆదాయం పొందుతూ దేశం బయట శాశ్వత కార్యాలయాలు ఉన్న డిజిటల్ కంపెనీలను దీని పరిధిలోకి తీసుకొచ్చారు. గూగుల్, ఫేస్బుక్, ట్విటర్ వంటి దిగ్గజాలు మొత్తం ఈ చట్ట పరిధిలోకి వచ్చాయి. వీటికి వాణిజ్య ప్రకటనల ద్వారా భారత్‌లో అత్యధిక ఆదాయం లభిస్తోంది. వాస్తవానికి డిజిటల్ కంపెనీలు చెల్లించాల్సిన స్థాయిలో పన్నులు కట్టడంలేదనే విమర్శలున్నాయి.
మన పన్ను వ్యవస్థలో డిజిటల్ ప్రపంచానికి సంబంధించిన సరైన చట్టాలు లేకపోవడం దీనికి ప్రధాన కారణం. దీనికి తోడు భారత్‌లో వాణిజ్య ప్రకటనల సొమ్ము విదేశాల్లోని కంపెనీ హెడ్ ఆఫీస్‌లకు వెళుతుండటంతో.. అవి దేశీయంగా ఏర్పాటు చేసిన అనుబంధ కంపెనీలకు పేరు తర్వాత ‘ఇండియా లిమిటెడ్’ అని పెట్టుకొన్నా.. వాటిని నుంచి పన్నులు అంతగా రాకపోవడం కూడా ఓ కారణం. ఎందుకంటే ఆదాయం ఎక్కువ భాగం విదేశాల్లోని మాతృ సంస్థలకు చేరిపోతుంది. ఈ నేపథ్యంలో ఈక్వలైజేషన్ లెవీ పేరుతో ప్రత్యక్ష పన్నును తీసుకొచ్చింది.
లొసుగులు వాడుకొంటూ..
వాస్తవానికి డిజిటల్ దిగ్గజాలకు పన్ను తక్కువగా విధించే వివిధ దేశాల్లో అనుబంధ కంపెనీలు ఉంటాయి. ఇక్కడ వచ్చిన ఆదాయాన్ని పలు ఖర్చులు , వ్యయాల రూపంలో విదేశాల్లోని అనుబంధ కంపెనీలకు బదలాయిస్తున్నాయి. దీంతో ఇక్కడ తక్కువ లాభం చూపి.. ఆ మేరకే పన్నులు చెల్లించేవి. 2018లో ఓ దిగ్గజ కంపెనీ రూ.16వేల కోట్లను ఇలా సింగపూర్‌కు తరలించినట్లు పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. ఐరోపాలో చాల కంపెనీలు తమ ప్రధాన కార్యాలయాన్ని పన్ను స్వర్గధామంగా పేరున్న ఐర్లాండ్‌లో నిర్వహించడంతో మిగిలిన దేశాలకు ఆదాయం పడిపోయింది. దీంతో ఫ్రాన్స్ ప్రభుత్వం లాభంతో సంబంధం లేకుండా ఆదాయంపై 3శాతం పన్నులు చెల్లించాలని అమెరికా కంపెనీలకు డిజిటల్ ట్యాక్స్‌ను విధించింది.
ఈక్వలైజేషన్ లెవీ ఎలా పనిచేస్తుంది..?
భారత్ కూడా 2016లో డిజిటల్ కంపెనీల వాణిజ్య ప్రకటనల ఆదాయంపై 6శాతం పన్ను విధించింది. దీనిని వినియోగదారుడే నేరుగా ప్రభుత్వానికి చెల్లించాలి. లేకపోతే భారీ జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2019లో ఈ పన్నుపై రూ.900 కోట్లు వసూలు చేసింది. 2020లో దీనిని సవరించి ఎటువంటి ఆదాయంపైన అయినా 2శాతం డిజిటల్ సర్వీస్ పన్ను చెల్లించాలని చట్టం చేసింది. ఏప్రిల్ 1 నుంచి దీనిని అమల్లోకి తెచ్చింది. ఈ పరిధిలోకి బిజినెస్ టూ కన్జ్యూమర్ కంపెనీలను తీసుకొచ్చింది. ఈ కంపెనీలే కస్టమర్ల నుంచి వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించాలి. దీంతో భారత్‌లోని అమెరికా కంపెనీలు ఈ సరికొత్త పన్నుపై అసంతృప్తిగా ఉన్నాయి. విషయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చేరింది. దీంతో భారత్ సహా తొమ్మిది దేశాలపై అమెరికా దర్యాప్తు మొదలు పెట్టింది. ఈ పన్ను విధించడం ఎంత వరకు సహేతుకం అనే అంశాన్ని దీనిలో పరిశీలిస్తున్నారు.
వేడెక్కిన వాతావరణ..
తొలుత అమెరికా కంపెనీలపై డిజిటల్ ట్యాక్స్ విధించి అమలు చేసిన దేశం ఫ్రాన్స్. శుక్రవారం నాడు ఫ్రాన్స్ నుంచి వచ్చే సరుకులపై 25శాతం అదనపు డ్యూటీలు విధించనున్నట్లు అమెరికా వాణిజ్య ప్రతినిధి (యూఎస్టీఆర్) ప్రకటించారు. ఆ తర్వాత మరో 180 రోజులు దీనిని వాయిదా వేశారు. మళ్లీ చర్చలు మొదలుపెట్టారు. దీంతో భారత్‌తో కూడా అమెరికా చర్చలు జరపనుంది. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు జులై7 నాటికే ప్రభుత్వానికి చెల్లించాల్సిన డిజిటల్ ట్యాక్స్‌ను ఆపాయి.
భారత్, ఇతర దేశాలు అమెరికా కంపెనీలపై వివక్ష పూరితంగా ఉన్నాయని యూఎస్టీఆర్ భావిస్తోంది. కానీ, భారత్ వాదన భిన్నంగా ఉంది. ఈ ట్యాక్స్ పరిధి విస్తృతంగా ఉన్నా.. వచ్చే ఆదాయం తక్కువగా ఉందని.. ఈ క్రమంలో దీనిని ఆదాయం కోసం వివక్షపూరితంగా విధించినట్లు చెప్పలేమని ప్రత్యక్ష పన్నుల బోర్డు మాజీ సభ్యుడు చెబుతున్నారు. ఇప్పటికే భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్‌కు సంబంధించిన దాదాపు 6 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను అమెరికా జీఎస్పీ నుంచి బయటకు తీసుకొచ్చింది. మరోపక్క భారత్ కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే కీలక వస్తువులపై పన్నులను పెంచింది. తాజా ఈ డిజిటల్ ట్యాక్స్ మరో వివాదానికి బీజం వేసింది.