close

తాజా వార్తలు

Published : 28/05/2020 02:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రండి చర్చించుకుందాం..!

భాగస్వామ్య పక్షాలకు ఉద్ధవ్‌ పిలుపు

ముంబయి: మహారాష్ట్ర అధికార కూటమి ‘మహా వికాస్‌ ఆఘాడీ’ భాగస్వామ్య పక్షాలను ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే‌ సమావేశానికి ఆహ్వానించారు. సీఎం అధికారిక నివాసంలో బుధవారం మధ్నాహ్నం ఈ భేటీ జరగనుందని సమాచారం. సంకీర్ణ పక్షాల్లో విభేదాలు తలెత్తాయని ఊహాగానాలు వినిస్తున్న వేళ ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వంలో సంక్షోభం తలెత్తిందనే ఊహాగానాలను ఎన్‌సీపీ, శివసేన ఇప్పటికే ఖండించిన సంగతి తెలిసిందే.

మరోవైపు కరోనాను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు నారయణ రాణే గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. దీంతో మహారాష్ట్రలో రాజకీయాలు మరోసారి వార్తల్లో నిలిచాయి.

ఈ నేపథ్యంలో ఉద్ధవ్‌ ఠాక్రేతో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అసంతృప్తితో ఉన్న మహారాష్ట్ర మాజీ సీఎం ఫడణవీస్‌ తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు పన్నినా తమ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారన్నారు. ఒకవేళ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టాలని చూస్తే.. ప్రజలే తిరగబడతారని అన్నారు.

అంతకుముందు ఆంక్షల సడలింపుపై ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, ఉద్ధవ్‌ ఠాక్రే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే లాక్‌డౌన్‌ను ఎత్తివేయక తప్పదని పవార్‌ సూచించారు. మరోవైపు వైరస్‌ను కట్టడి చేయాలంటే లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గమని ఠాక్రే స్పష్టం చేశారు. ఈ విషయంలో సంకీర్ణ పక్షాల మధ్య విభేదాలు తలెత్తినట్లు ముంబయి వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు ఇచ్చిన మినహాయింపులు సైతం కాంగ్రెస్‌, ఎన్సీపీ ఒత్తిడి మేరకేనన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు నిన్న ఓ సందర్భంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో తమ పార్టీ నిర్ణయాత్మక స్థానంలో లేదన్నారు. కేవలం ప్రభుత్వానికి మద్దతుగా మాత్రమే ఉందన్నారు. పరోక్షంగా మహారాష్ట్ర కొవిడ్‌ సంక్షోభం నుంచి దూరం జరిగే ప్రయత్నం చేసినట్లు విమర్శకులు అభిప్రాయపడ్డారు. రాహుల్‌ వ్యాఖ్యలతో శివసేన వర్గాలు నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఉద్ధవ్‌ సమావేశానికి పిలుపునివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని