close

తాజా వార్తలు

Published : 08/11/2020 22:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా ఎఫెక్ట్‌: మహారాష్ట్ర కీలక నిర్ణయం

ముంబయి: కరోనా విస్తృతి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో దేశంలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక నిబంధనల నడుమ విద్యాసంస్థలు, ప్రార్థనా స్థలాలు తెరిచేందుకు అనుమతిచ్చాయి. తాజాగా దేశ ఆర్థిక రాజధాని ముంబయి సహా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించిన కార్యాచరణను దీపావళి పండగ తర్వాతే ప్రారంభిస్తామన్నారు. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు మాత్రమే పాఠశాలలు తెరుస్తామని సూచనప్రాయంగా చెప్పారు. ఈ మేరకు అధికారులు నిబంధనలను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రార్థనా స్థలాలకు వయస్సు మళ్లినవారే ఎక్కువగా వెళ్లేందుకు అవకాశం ఉండటం వల్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఠాక్రే కోరారు. ఒక దశలో దేశంలోనే అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టింది. గత ఏడెనిమిది నెలలుగా కార్యలాపాలు మందగించడంతో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఠాక్రే ప్రభుత్వం సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే వ్యాపార కార్యకలాపాలు, బార్లు, రెస్టారెంట్లు, ఆఫీసులు నిర్వహించుకునేందుకు అనుమతిచ్చింది. దేశంలో రెండోసారి కరోనా విజృంభించే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని ఠాక్రే పిలుపునిచ్చారు.

ఒక వేళ దీపావళి తర్వాత ప్రార్థనా స్థలాలు తెరచుకున్నా.. చాలా జాగ్రత్త వహించాలని ముఖ్యమంత్రి ఉద్దవ్‌ఠాక్రే సూచించారు. తప్పని సరిగా మాస్కు ధరించుకోవాలని కోరారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రార్థనాస్థలాల పునః ప్రారంభంపై గతంలో సీఎం ఠాక్రే, గవర్నర్‌  బీఎస్‌ కోశ్యారీ మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. దసరా పండుగ సమయంలో భక్తులు భారీ సంఖ్యలో గుమిగూడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆలయాలు, ప్రార్థనా మందిరాలను తెరిచేందుకు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే నిరాకరించారు. దీనిపై స్పందించిన కోశ్యారీ.. ‘‘బార్లు, రెస్టారెంట్లు, బీచ్‌లను తెరిచారు. కానీ దేవుళ్లను లాక్‌డౌన్‌లో ఉంచారు. ఇలా చేయమని భగవంతుడి నుంచి మీకేమైనా ఆదేశాలు వచ్చాయా? లేదా మీరే అకస్మాత్తుగా లౌకికవాదిగా మారారా?’’ అని లేఖలో ప్రశ్నించారు. ఇది వారివురి మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది.  దీనికి ఠాక్రే దీటుగా బదులిచ్చారు.  తాను హిందుత్వ వాదినని చెప్పుకోవడానికి సర్టిఫికెట్లేవీ అవసరం లేదని, ప్రస్తుత పరిస్థితులు, పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని