close

తాజా వార్తలు

Published : 27/07/2020 11:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ధారవిలో కరోనా: నమ్మశక్యం కాని గణాంకాలు!

ముంబయి: ఒకప్పుడు కొవిడ్‌ వ్యాప్తికి కేంద్రబిందువుగా మారిన ధారవి.. ఇప్పుడా మహమ్మారిని జయించటంలో ముందడుగు వేసి ఆదర్శంగా నిలుస్తోంది. ఆసియాలోనే అతిపెద్దదైన ఈ మురికివాడలో అధికారిక గణాంకాల ప్రకారం ఆదివారం నాడు నమోదైన కరోనా వైరస్‌ కేసుల సంఖ్య కేవలం రెండు మాత్రమే కావటం గమనార్హం. ఇక్కడ ఇప్పటి వరకు 2531 కొవిడ్‌-19 కేసులు నమోదుకాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 113 మాత్రమే. అంతేకాకుండా కరోనా సోకిన వారిలో 2000 మందికి పైగా కోలుకున్నట్టు తెలియచేస్తున్న గణాంకాలు ఆశావహంగా ఉన్నాయి.

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని ధారవి, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే మురికివాడగా ప్రసిద్ధి పొందింది. ఈ ప్రాంతంలో తొలి కరోనా కేసు ఏప్రిల్‌లో నమోదయింది. దీంతో అధికారులు, ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. కేవలం 2.16 చ.కి.మీ. విస్తీర్ణం కలిగి, పది లక్షలు దాటిన జనాభాతో సామాజిక దూరాన్ని పాటించటం ఇంచుమించు అసాధ్యం అనే పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఈ నేపథ్యంలో.. ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న కేసుల సంఖ్య తొలుత ఆందోళన కలిగించినా.. మడమ తిప్పని ‘బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌’ అధికారులు కరోనా కట్టడికి ప్రత్యేక వ్యూహాన్ని రచించారు.

దీనిలో భాగంగా 47 వేల గృహాల్లో సుమారు సుమారు ఏడు లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ముందస్తు పరీక్షల నిర్వహణతో అనేక కేసులను పరిస్థితి తీవ్రం కాకముందే గుర్తించారు. ఈ చర్యల ఫలితంగా మే నెలలో సగటున ప్రతిరోజు 60 కొత్త కేసులు నమోదు కాగా, జూన్‌ నాటికి ఈ సంఖ్య 20కి పడిపోయింది. ఇక గత కొద్ది రోజులుగా ఇక్కడ నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య రోజుకు పదికన్నా తక్కువ కావటం గమనార్హం. అధికారిక గణాంకాల ప్రకారం ధారవిలో జులై 22 నాటికి ఐదు, జులై 23న ఆరు కేసులు నమోదయ్యాయి. ఇక ఆదివారం నాటికి ఈ సంఖ్య కేవలం రెండుగా ఉండటం విశేషం. కాగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే నేడు ధారవిలో ప్లాస్మా దానం కార్యక్రమాన్ని ఆరంభించనున్నారు.


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని