
తాజా వార్తలు
అబద్ధాల్లో వారిద్దరూ పోటీపడుతున్నారు:కిషన్‌రెడ్డి
హైదరాబాద్: ప్రజలు మార్పుకోరుకుంటున్నారని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరునూ కలిసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. నగరంలో ఏ ప్రాంతానికి వెళ్లినా భాజపాను ప్రజలు ఆశీర్వదిస్తున్నారని.. తమ పార్టీకి యువత, విద్యార్థులు, మహిళలే బలమన్నారు. చాలాచోట్ల యువతే స్వచ్ఛందంగా ముందుకొచ్చి భాజపాకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారని కిషన్‌రెడ్డి చెప్పారు. పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేయడంలో తండ్రీకొడుకులు పోటీపడుతున్నారని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి కిషన్‌రెడ్డి విమర్శించారు. దుబ్బాక విజయానికి యువతే ప్రధాన కారణమని.. జీహెచ్ఎంసీ విజయంలోనూ వాళ్లే కీలకంగా వ్యవహరించనున్నారని చెప్పారు. గ్రేటర్లో భాజపా విజయం సాధిస్తే కుటుంబాల ప్రమేయం లేని నీతివంతమైన సమర్థ పాలన అందిస్తుందన్నారు. ఇచ్చిన హామీలు తప్పకుండా అమలు చేస్తామని.. దేశంలో 80 శాతం కార్పొరేషన్లు తమ పార్టీ చేతుల్లోనే ఉన్నాయని చెప్పారు. జీహెచ్ఎంసీలో గృహనిర్మాణ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యమిస్తామన్నారు. వరద, బురదలేని హైదరాబాద్‌ను నిర్మిస్తామని.. ఆ వివరాలన్నీ తమ మేనిఫెస్టోలో పొందుపరుస్తామని స్పష్టం చేశారు.
ఇంటికొక బోటు కావాలా? కాల్వల పునరుద్ధరణ కావాలా?
హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌లపై ఉన్న టాయిలెట్స్‌పై ఎక్కడ చూసినా తెరాస నేతల హోర్డింగులు పెట్టారని.. ఎన్నికల కోడ్ వచ్చాక వాటిని నెలకొల్పారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఇది పూర్తిగా హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమన్నారు. టాయిలెట్స్‌లో నీరు లేకపోయినా కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో కేవలం ప్రచారం కోసం హోర్డింగులు పెట్టారని ఆక్షేపించారు. ఇంతా అధికార దుర్వినియోగమా? అని ప్రశ్నించారు. 2016 గ్రేటర్ ఎన్నికల్లో తెరాస ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మళ్లీ పాత హామీలే మేనిఫెస్టోలో ప్రకటించారని కిషన్‌రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీలో మళ్లీ తెరాస అధికారంలోకి వస్తే ఇంటికొక బోటు ఇవ్వాలని వ్యాఖ్యానించారు. భాజపా గెలిస్తే వర్షాకాలం వచ్చేనాటికి యుద్ధప్రాతిపదికన పూర్తిస్థాయిలో వరదనీటి కాల్వలను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. భాజపా మేయర్ ఆధ్వర్యంలో సమర్థంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఇంటికొక బోటు కావాలా?యుద్ధప్రాతిపదికన వరదకాల్వల నిర్మాణం కావాలా? ఏది అవసరమో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు.
కేంద్రంపై తప్పుడు ప్రచారాలు మానుకోండి
తెరాస మేనిఫెస్టోలో పెట్టిన అనేక పథకాలకు కేంద్ర ప్రభుత్వ నిధులు అందుతున్నాయని కిషన్‌రెడ్డి అన్నారు. ఎల్ఈడీ లైట్లు, 169 బస్తీ దవాఖానాలను కేంద్రం ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వాటినే పేరు మార్చి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం సహకారంపై తెరాస నేతలు విష ప్రచారం చేస్తున్నారని.. ప్రజలు వాస్తవాలను అర్థం చేసుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో అబద్ధాలు ఆడటం, పూనకం వచ్చినట్లు వ్యవహరించడం తెరాస నేతలు, కేసీఆర్ కుటుంబానికి అలవాటని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెరాస నేతలు విచక్షణతో వ్యవహరించాలని.. తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. నీతి, నిజాయతీతో పనిచేసే భాజపా ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు కేసీఆర్, కేటీఆర్‌లకు లేదన్నారు. దుబ్బాక తీర్పును శిరసావహించాల్సిన తెరాస నేతలు.. దానిపైనా విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. ‘‘దుబ్బాకలో కోరుకున్నారు.. హైదరాబాద్‌లో కోరుకుంటున్నారు.. తెలంగాణలో కోరుకుంటారు’’ అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వాస్తవాలను ప్రజల ముందు పెడుతున్నామని.. ప్రజలే అంతిమ నిర్ణేతలని చెప్పారు.