
తాజా వార్తలు
భాజపా లబ్ధి కోసమే ప్రధాని వచ్చారు: ఉత్తమ్
హైదరాబాద్: కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న చర్యల వల్లే ఇవాళ హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్త గర్తింపు లభించిందన్నారు. రాయదుర్గం డివిజన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఉత్తమ్ మాట్లాడారు. ఇప్పటివరకు హైదరాబాద్‌లో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే.. కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు. ఎంఐఎం, భాజపా పార్టీలు కలిసి మ్యాచ్ ఫిక్సింగ్‌తో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. కులమతాలతో సంబంధం లేకుండా ఎన్నో ఏళ్ల కింద నగరానికి వచ్చి స్థిరపడిన వారంతా కలిసిమెలిసి సామరస్య వాతావరణంలో జీవిస్తున్నారన్నారు. అలాంటి హైదరాబాద్‌లో మతం, కులం పేరుతో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా కొంత మంది నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒకరు సర్జికల్ స్ట్రైక్స్ అంటారు.. మరొక్కరు హైదరాబాద్ పేరు మార్చుతామంటారు.. అసలు వారికి హైదరాబాద్ చరిత్ర తెలిసే మాట్లాడుతున్నారా? అని ఉత్తమ్ నిలదీశారు.
‘‘భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తయింది. ఇన్నేళ్లలో తెలంగాణకు, ప్రత్యేకంగా హైదరాబాద్ నగరానికి భాజపా చేసింది సున్నా. స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ తన స్థాయిని తగ్గించుకొని కరోనా వ్యాక్సిన్ తయారీపై సమీక్ష పేరుతో హైదరాబాద్ వచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనే హైదరాబాద్ వచ్చేందుకు ప్రధానికి వీలు కుదిరిందా? ఇన్ని రోజులు ఏం చేశారు? జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే ఇవాళ ప్రధాని హైదరాబాద్ వచ్చారు. భాజపాకు లబ్ధి చేకూర్చేపనిలో భాగంగానే నగరానికి వచ్చారు. ప్రధాని రాకపోతే భారత్ బయోటెక్ సంస్థ కరోనా వ్యాక్సిన్ తయారు చేయడం ఆపేస్తుందా? తాత్కాలికంగా రాజకీయ లబ్ధి కోసం చెప్పే మాటలు నమ్మొద్దని.. ప్రజలు ఆలోచించాలి. చిత్తశుద్ధితో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది’’ అని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.