సువర్ణావకాశంగా చెత్త నిర్వహణ: ఉపరాష్ట్రపతి
close

తాజా వార్తలు

Updated : 28/12/2020 19:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సువర్ణావకాశంగా చెత్త నిర్వహణ: ఉపరాష్ట్రపతి

సీపెట్‌ను సందర్శించిన వెంకయ్యనాయుడు

విజయవాడ: స్వచ్ఛభారత్‌ స్ఫూర్తిగా ప్లాస్టిక్‌పైనా ప్రజా ఉద్యమం రావాలని.. ఒకసారి వినియోగించే ప్లాస్టిక్‌పై జనజాగృతి అవసరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ప్లాస్టిక్‌తో ఇబ్బంది లేదని.. వినియోగంలో ప్రజల వైఖరితోనే అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ప్రకృతితో ప్రేమగా ఉండాలని హితవు పలికారు. విజయవాడ నగర శివారులోని సూరంపల్లిలో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ(సీపెట్‌) కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి సందర్శించారు. సీపెట్‌ ప్రాంగణంలో మొక్కలు నాటిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను వెంకయ్య నాయుడు పరిశీలించారు. 

ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలి

సీపెట్ కేంద్రంగా అత్యాధునిక సాంకేతిక యంత్ర పరికరాలతో విద్యార్థులు తయారు చేసిన వస్తువులు, తయారు చేసే ప్రక్రియను ఆయన ఆసక్తిగా పరిశీలించారు. విద్యార్ధులు, అధ్యాపకులతో ముఖాముఖిగా వివిధ అంశాలపై మాట్లాడారు. నాలుగున్నరేళ్ల క్రితం తాను శంకుస్థాపన చేసిన సీపెట్‌ ఇప్పుడు మంచి పురోగతి సాధిస్తుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులు, అధ్యాపకులు, సీపెట్‌ నిర్వాహకులను ప్రశంసించారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో పీపీఈ కిట్లు, ప్లాస్టిక్ మెడికల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ల పాత్ర అభినందనీయమని చెప్పారు. ఐవీ ట్యూబ్‌లు, టిష్యూ ఇంజినీరింగ్, ఇంప్లాంట్స్, ఇన్సులిన్ పెన్‌ల వంటి వివిధ వైద్యపరికరాల తయారీలో పాలిమర్ పదార్థాలను విస్తృతంగా వాడుతున్నారన్నారు. ప్లాస్టిక్ ఉత్పత్తులను వినియోగించే విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి విజ్ఞప్తి చేశారు. 

రీసైక్లింగ్‌ మార్కెట్‌లో 6.5శాతం వృద్ధి రేటు..

ప్లాస్టిక్ కారణంగా పర్యావరణానికి ఎదురవుతున్న సమస్యలపై వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన ఉత్తమ పద్ధతులను అవలంబించాలన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పునర్‌ వినియోగం చేయడంతో పాటు రీసైకిల్ సూత్రాన్ని ఆచరించేలా ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పక్కనపెట్టడమే సమస్యకు పరిష్కారం కాదని.. బాధ్యతాయుతంగా ప్లాస్టిక్‌ను వినియోగిస్తూ సరిగా రీసైకిల్ అయ్యేలా చూడాలన్నారు. 2023 నాటికి ప్లాస్టిక్ రీసైక్లింగ్ మార్కెట్ 6.5 శాతం వృద్ధిరేటుతో 53.72 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.3.9లక్షల కోట్లకు చేరుకుంటుందనే మార్కెట్ అంచనాలున్నాయని వివరించారు. కొత్త ఔత్సాహిక వ్యాపారవేత్తలకు చెత్త నిర్వహణ ఓ సువర్ణావకాశంగా మారనుందని ఉపరాష్ట్రపతి చెప్పారు.

ఇవీ చదవండి..

కొవిడ్‌ నిబంధనల గడువు పొడిగించిన కేంద్రం 

రైతుల ఆందోళనలపై అమర్త్యసేన్‌ కీలక వ్యాఖ్యలు!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని