స్థల వివాదం వల్లే విజయవాడ గ్యాంగ్‌వార్‌
close

తాజా వార్తలు

Published : 05/06/2020 17:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్థల వివాదం వల్లే విజయవాడ గ్యాంగ్‌వార్‌

13 మంది నిందితుల అరెస్టు

వివరాలు వెల్లడించిన విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు

విజయవాడ: యనమలకుదురులోని 7 సెంట్ల స్థల వివాదం పటమటలో రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్‌వార్‌కు దారి తీసిందని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ఈ ఘర్షణకు సంబంధించి ఇప్పటివరకు 13 మందిని అరెస్టు చేసినట్లు సీపీ చెప్పారు. విజయవాడ పటమటలో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌వార్‌కు సంబంధించిన వివరాలను సీపీ మీడియాకు వివరించారు. ‘‘గత నెల 30న తోట సందీప్‌ తన అనుచరులతో తోటవారి వీధికి వెళ్లాడు. రెండో గ్రూపునకు చెందిన కోడూరి మణికంఠ అలియాస్‌ పండు తన అనుచరులతో అక్కడికి వెళ్లాడు. స్థల వివాదం నేపథ్యంలో చర్చల కోసమని రెండు గ్రూపులు ఒక చోట చేరాయి. ఆ రెండు గ్రూపుల మొదలైన వాగ్వాదం తారస్థాయికి చేరి ఘర్షణకు దారి తీసింది’’

‘‘ఘర్షణకు సంబంధించిన సమాచారం అందుకున్న పటమట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోగా రెండు గ్రూపులకు చెందిన వారు కత్తులు, రాళ్లతో తీవ్రంగా కొట్టుకున్నారు. వారిలో చాలా మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన తోట సందీప్ మరుసటి రోజు ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనికి సంబంధించి డీసీపీ హర్షవర్ధన్‌ ఆధ్వర్యంలో 6 బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుల కోసం గాలించారు. ఈ నెల 4వ తేదీ రాత్రి రేపల్లె ప్రశాంత్‌, ఆకుల రవితేజ, ప్రేమ్‌ కుమార్, ప్రభు కుమార్, బోనోత్‌ శ్రీను నాయక్‌లను అరెస్టు చేయగా.. ఇవాళ ఉదయం మరో 8 మందిని అరెస్టు చేశాం. నిందితుల నుంచి కత్తులు, కోడికత్తులు, రాడ్లు స్వాధీనం చేసుకున్నాం. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 13 మందిని అరెస్టు చేశాం’’ అని సీపీ వివరించారు.

విజయవాడలో ప్రశాంత వాతావరణం ఉండాలని కోరుతున్నామని.. ఇకపై విజయవాడలో గ్యాంగ్‌ వార్‌లు, ఘర్షణలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. ఇప్పటి నుంచి విజయవాడలోని రౌడీ షీటర్లపై నిఘా మరింత కట్టుదిట్టం చేస్తామని సీపీ తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని