
తాజా వార్తలు
కెయిర్న్ కేసులో తీర్పు వచ్చాకే వొడాఫోన్‌పై అప్పీల్!
ప్రభుత్వ యోచన
దిల్లీ: వొడాఫోన్ గ్రూప్ పీఎల్‌సీకి అనుకూలంగా వచ్చిన అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థాన (ఆర్బిట్రేషన్) తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు.. కెయిర్న్ ఎనర్జీ పన్ను వివాదంలో వెలువడే తీర్పు కోసం ప్రభుత్వం ఎదురుచూస్తున్నట్లు తెలుసోంది. రెట్రోస్పెక్టివ్ (వెనకటి తేదీ నుంచి విధించిన) పన్నుల కింద రూ.10,247 కోట్లు చెల్లించాలంటూ ప్రభుత్వం పంపిన నోటీసులపై ఆర్బిట్రేషన్‌ను కెయిర్న్ ఎనర్జీ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ కేసులో తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే కెయిర్న్ ఎనర్జీకి రూ.7,600 కోట్లకు పైగా చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే ఎలాంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉండదు. కెయిర్న్ కేసు వ్యవహారంలో ప్రభుత్వం ఇచ్చిన పన్ను నోటీసులను సమర్థిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటే.. వొడాఫోన్ తీర్పుపై అప్పీలుకు వెళ్లేందుకు ప్రభుత్వానికి మంచి అవకాశం దొరికినట్లు అవుతుందని ఈ పరిణామాన్ని గమనిస్తున్న వర్గాలు వెల్లడించాయి. రూ.22,100 కోట్ల రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదంలో బ్రిటిష్ టెలికాం దిగ్గజం వొడాఫోన్ గ్రూప్ పీఎల్‌సీకి అనుకూలంగా సెప్టెంబరులో ఆర్బిట్రేషన్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.