ఇప్పుడు మరింత అప్రమత్తత అవసరం:WHO 
close

తాజా వార్తలు

Published : 12/05/2020 09:12 IST

ఇప్పుడు మరింత అప్రమత్తత అవసరం:WHO 

న్యూయార్క్‌: సుదీర్ఘ లాక్‌డౌన్‌ తర్వాత అనేక దేశాలు ఆంక్షల్ని సడలిస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) కీలక సూచన చేసింది. రాబోయే కాలంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రపంచ దేశాలకు హితవు పలికింది. లేదంటే రెండోసారి మహమ్మారి విజృంభణకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఏర్పడొచ్చని హెచ్చరించింది.

ఇప్పటికే ఆంక్షల్ని సడలించిన పలు దేశాల్లో వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. జర్మనీలో నిబంధనల్ని సడలించిన తర్వాత వైరస్‌ వ్యాప్తి వేగవంతమైనట్లు గుర్తించారు. మరోవైపు కరోనాను సమర్థంగా ఎదుర్కొని ప్రపంచదేశాల ప్రశంసలందుకున్న దక్షిణ కొరియాలో ఆంక్షల సరళతరం చేసిన తర్వాత నైట్‌ క్లబ్‌లు మహమ్మారి వ్యాప్తికి కేంద్రాలుగా మారాయి. ఈ నేపథ్యంలోనే డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచ దేశాల్ని అప్రమత్తం చేసేందుకు సిద్ధమైంది.

లాక్‌డౌన్‌ నుంచి సాధారణ పరిస్థితుల దిశగా ఆశావహ దృక్పథంతో పయనిస్తున్న ప్రపంచం.. మరింత అప్రమత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని సంస్థ అత్యవసర విభాగం చీఫ్‌ మైకేల్‌‌ ర్యాన్‌ సూచించారు. తీవ్రత తక్కువగా ఉండి గుర్తించలేని స్థితిలో ఉన్న వైరస్‌ రానున్న కాలంలో మరోసారి ప్రపంచానికి సవాల్‌ విసిరే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆంక్షల సడలింపులో కొన్ని దేశాలు గుడ్డిగా ముందుకు సాగుతున్నాయని ఇది ప్రజాశ్రేయస్సుకు ఏమాత్రం మంచిదికాదని అభిప్రాయపడ్డారు.

ఆంక్షల్ని ఎత్తివేయడం అనివార్యమైనప్పటికీ.. నెమ్మదిగా, క్రమంగా, దశలవారీగా సడలించడం చాలా ముఖ్యమని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ అభిప్రాయపడ్డారు. ప్రాథమిక అధ్యయనాల ప్రకారం.. చాలా మందిలో వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనే యాంటీబాడీలు ఊహించిన దానికంటే తక్కువ స్థాయిలో ఉన్నాయని తేలిందన్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఈ వైరస్‌ బారిన పడే ముప్పు ఇంకా ఉందని తెలిపారు. ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’ వస్తుందన్న ఆశతో పటిష్ఠ చర్యలు చేపట్టకపోవడం చాలా ప్రమాదకరమని హెచ్చరించారు.

ఇదీ చదవండి..

కొత్త సాధారణ లోకం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని