
తాజా వార్తలు
వచ్చేవారం చైనాకు డబ్ల్యూహెచ్‌వో బృందం
దిల్లీ: వచ్చేవారం ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఓ బృందం చైనాలో పర్యటించనుంది. కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించిన మూలాలతో పాటు అది మానవులకు ఎలా సోకిందనే దానిపై ఈ బృందం అధ్యయనం చేయనుంది. ఈ మహమ్మారి గురించి ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో చైనా విఫలమైందంటూ వివిధ దేశాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న తరుణంలో డబ్ల్యూహెచ్‌వో పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. వైరస్ పూర్తి స్థాయిలో వెలుగులోకి వచ్చిన ఆరు నెలల తర్వాత ఈ పర్యటన జరగనుండడం గమనార్హం. తొలిసారి జనవరిలో వుహాన్ నగర మున్సిపల్ అధికారులు చేసిన కొత్త ‘వైరల్ న్యూమోనియా’ ప్రకటనను డబ్ల్యూహెచ్‌వో పరిగణనలోకి తీసుకుంది. ఆ వెంటనే జరిగిన ఓ మీడియా సమావేశంలో సంస్థ డైరెక్టర్ టెడ్రోస్ అధనోమ్ కరోనా వైరస్‌కు సంబంధించి తొలి అధికారిక ప్రకటన చేశారు.
డిసెంబరుకు ముందు చైనాలో ఏం జరిగింది.. ఎప్పుడు తొలి కేసు నమోదైంది.. జంతువుల నుంచి మానవులకు ఎలా సంక్రమించింది వంటి అంశాలపై ఈ పర్యటనలో లోతైన పరిశోధన చేయనున్నామని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. డిసెంబరు 31న తొలిసారి చైనా దీనిపై అధికారిక ప్రకటన చేసిందని.. ఆ మరుసటి రోజే డబ్ల్యూహెచ్‌వో దీన్ని గుర్తించి.. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం చర్యలు ప్రారంభించిందని తెలిపారు. ఇప్పటి వరకు వైరస్ జన్యుక్రమాన్ని బట్టి చూస్తే ఇది గబ్బిలాల నుంచే సంక్రమించినట్లు తెలుస్తోందన్నారు. అయితే, మనుషులకు సోకడానికి ముందు మరే జంతువుకైనా ఈ వైరస్ సంక్రమించిందా లేక నేరుగా గబ్బిలాల నుంచే మానవులకు వచ్చిందా అనే దానిపై పరిశోధన జరగాల్సి ఉందన్నారు. వీటన్నింటినీ కనుగొంటే వైరస్ కట్టడిలో పురోగతి సాధించే అవకాశం ఉందన్నారు.