
తాజా వార్తలు
మైనారిటీ వాటాదార్ల రక్షణలో వెనకబడ్డాం
మరింత దృష్టి పెట్టాలి
ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి ఆనందమోహన్
ముంబయి: మైనారిటీ వాటాదార్ల ప్రయోజనాలను పరిరక్షించడంలో భారత స్కోరు ఇటీవలి తగ్గిందని.. ఈ విషయంలో మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉందని ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకుల్లో భాగంగా ఈ స్కోరు వెల్లడైంది. స్వల్పకాల ప్రయోజనాలకు బదులుగా దీర్ఘకాల వ్యూహాలను రచించి మదుపర్లను క్యాపిటల్ మార్కెట్ల వైపు ఆకర్షించి, వారు కొనసాగేలా చూడాల్సిన బాధ్యత బ్రోకర్లపైనే ఉందని బీబీఎఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అదనపు కార్యదర్శి ఆనంద్ మోహన్ బజాజ్ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో బ్రోకరేజీ సంస్థలు డిఫాల్ట్ అయిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడడం గమనార్హం. మైనారిటీ వాటాదార్లను రక్షించడంలో భారత ర్యాంకు గతేడాది 7గా ఉండగా.. 2020 నివేదికలో 13వ స్థానానికి పడిపోయింది. ‘మైనారిటీ వాటాదార్ల ప్రయోజనాలను కాపాడడంలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఎపుడూ పైనే ఉంటుంది. ఇటీవల కాస్త వెనకబడింది. ఈ నేపథ్యంలో మన సాంకేతికత, ఫిన్టెక్, ఇతర రకాల సమాచారం ఆధారంగా తిరిగి వారి ప్రయోజనాలను కాపాడడంలో పునరంకితమవుదామ’ని బ్రోకరేజీ సంస్థలకు ఆయన పిలుపునిచ్చారు. అన్ని బ్రోకరేజీ పనులు డిజిటలీకరణ అవుతున్నందున, దశాబ్దం తర్వాత బ్రోకరేజీ పరిశ్రమ భవితవ్యంపై ఇదే కార్యక్రమంలో పాల్గొన్న జెరోధా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ ఆందోళన వ్యక్తం చేశారు.