
తాజా వార్తలు
దేశంలోని అనేక ప్రాంతాలకు మా సేవలు
ఇంటర్నెట్ డెస్క్: రాబోయే పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని అమెజాన్ ప్రైమ్ వేదికగా తొమ్మిది కొత్త చిత్రాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. వరుణ్ ధావన్, సారా అలీఖాన్ జంటగా నటిస్తున్న ‘కూలీ నం-1’, హన్సల్ మెహతా తెరకెక్కిస్తున్న ‘ఛలంగ్’, భూమి పెడ్నేకర్ కీలక పాత్రలో నటిస్తున్న ‘దుర్గావతి’, సూర్య ముఖ్య పాత్రలో నటించిన ‘సూరరై పోట్రు’, తెలుగు సినిమా ‘మిడిల్ క్లాస్ మెలోడిస్’, మలయాళం నుంచి ‘హలాల్ లవ్‌స్టోరీ’ చిత్రాలను విడుదల చేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ సందర్భంగా ప్రైమ్ వీడియో భారత్ జనరల్ మేనేజర్, డైరెక్టర్ అయిన గౌరవ్ గాంధీ మాట్లాడుతూ... ‘‘మేం ఒక సంస్థగా దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన సినిమాలు అభిమానులకు అందించాలనుకుంటాం. అందువల్ల దేశంలోని వివిధ భాషలకు చెందిన చిత్రాలను మా ఓటీటీ వేదికపై విడుదల చేస్తున్నాం. ఈ విధంగా సినిమాలను విడుదల చేస్తే ప్రపంచ స్థాయి మార్కెట్‌ను అందిపుచ్చుకోవడంతో పాటు వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు కూడా ఈ చిత్రాలను వీక్షిస్తారు. మాకు ప్రతి భాషలో సినిమాను చూసేవారు కూడా ముఖ్యమే. అంతర్జాతీయంగా 180దేశాల్లోని 4000పట్టణాల్లోని అభిమానులు మా ప్లాట్‌ఫామ్‌పై విడుదలై చిత్రాలు చూశారు. నిజం చెప్పాలంటే మేం విడుదల చేసే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలను 50శాతం కంటే ఎక్కువ మంది వేరే రాష్ట్రం వారే చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఈ చిత్రాలను పంపిణీ చేసేవారు లేరు. మేం అభిమానుల దగ్గరకి ఈ చిత్రాలను తీసుకు వెళుతున్నాం. వారు డబ్బులు చెల్లించి ఇంటిలోనే కూర్చొని నచ్చిన సమయంలో ఈ చిత్రాలను వీక్షించవచ్చు. ఏదైనా ఒక కొత్త విధానం వచ్చినప్పుడు దానిని వ్యతిరేకించే వారు కూడా ఉంటారు’’ అని అన్నారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో కంటెంట్ హెడ్, డైరెక్టర్ విజయ్ సుబ్రమణ్యం మాట్లాడుతూ...‘‘ నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మా భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా చిత్రాలను విడుదల చేసుకున్నారు. పండగ సీజన్లో అక్టోబర్ నుంచి డిసెంబరు మధ్యలో పెద్ద చిత్రాలను కూడా విడుదల చేయడం మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వివిధ భాషలకు చిత్రాలను తెరకెక్కించే నిర్మాతలతో దృఢమైన, వ్యూహాత్మకమైన సంబంధాలు పెంపొందించుకోవాలి. దేశంలో సృజనాత్మకంగా సినిమాలు నిర్మించేవారికి భాషతో సంబంధం లేకుండా ఒక వేదికను ఏర్పాటు చేయాలన్నదే మా లక్ష్యం. అభిమానులకు మంచి సినిమాలను అందించటం పైనే మా దృష్టి ఉంటుంది. భారీ స్థాయిలో కాకుండా ప్రతి భాషకు చెందిన మంచి చిత్రాలను మాత్రమే మేం విడుదల చేయాలనుకుంటున్నాం. మేం ప్రతి మార్కెట్లోకి ప్రవేశించడానికి ఉత్సుకతో ఉన్నాం’’అని చెప్పారు.