close

తాజా వార్తలు

అమెరికా కారైతే ఏంటీ..? ఇది ఇండియా..!

 భారత్‌లో కుదురుకోలేకపోతున్న అగ్రరాజ్య కంపెనీలు


ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం 

జనరల్‌ మోటార్స్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల కంపెనీల్లో ఒకటి.. అయితే భారత్‌లో మాత్రం నిలదొక్కుకోలేదు.. 2017లో భారత మార్కెట్‌ నుంచి నిష్క్రమించింది. 

ఫోర్డు.. అసలు కారు అనే దాన్ని తయారు చేసిందే ఈ కంపెనీనే.. లాభదాయకమైన కూర్పు(అసెబ్లింగ్‌) విధానాన్ని పారిశ్రామిక రంగానికి పరిచయం చేసింది కూడా ఈ కంపెనీనే.. కానీ.. భారత్‌లో మాత్రం కదురుకోలేకపోయింది. ఇక్కడి మార్కెట్లో నిలదొక్కుకోవడానికి చివరికి దేశీయ కంపెనీ మహీంద్రాతో జట్టు కట్టాల్సి వచ్చింది.. ఎందుకు..? మిగిలిన ప్రపంచ మార్కెట్ల కంటే భారత్‌లో భిన్నంగా ఏముంది..? అది భారీ కంపెనీలను ఎందుకు ఊపిరి తీసుకోనివ్వడంలేదు.. భారతీయుల నాడి పట్టుకోవడంలో అమెరికన్లు ఎందుకు విఫలమయ్యారు.  భారత మార్కెట్లో అమెరికా కంపెనీల వైఫల్యాలను తెలుసుకొందాం. 

దాదాపు 130 కోట్ల జనాభాతో చైనా తర్వాత భారత్‌ అతిపెద్ద వాహన మార్కెట్‌గా అవతరించింది. గ్లోబలైజేషన్‌ మొదలైనప్పట్టి నుంచి క్రమక్రమంగా ప్రపంచవ్యాప్త కంపెనీలకు ఈ మార్కెట్‌ తెరుచుకుంది. ఇక్కడి మార్కెట్‌లో మెజార్టీ వాటా పొందేందుకు విదేశీ కంపెనీలు క్యూ కట్టాయి. 20 ఏళ్ల క్రితం ఏటా 5,00,000 కొత్త కార్లు కొంటే.. అది 2018 నాటికి ఏటా 35లక్షలకు చేరింది. వచ్చే పదేళ్లలో ఈ మార్కెట్‌ ఏటా 6శాతం వరకు పెరగొచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ మార్కెట్‌ను అందుకోవడంలో అమెరికాకు చెందిన జనరల్‌ మోటార్స్‌(జీఎం), ఫోర్డు ఇబ్బందులు పడ్డాయి. 

భారత మార్కెట్లు ఇలా..

భారత్‌లో వైవిధ్య భరితమైన భౌగోళిక ప్రాంతాలు, ప్రజల అభిరుచులు భిన్నంగా ఉంటాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య తేడా చాలా ఎక్కువగా ఉంటుంది. పట్టణ, గ్రామీణ ప్రజల అవసరాలు, అభిరుచులు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ మార్కెట్లను.. కారు ధర, ఇంధన సామర్థ్యం, తిరిగి అమ్మకం విలువ, సర్వీసింగ్‌ సౌకర్యాలు ఎంత అందుబాటులో ఉన్నాయనే అంశం, విడిభాగాల ధరలు వంటివి బలంగా ప్రభావితం చేస్తున్నాయి.

ఇక్కడ ప్రజల ఆదాయాల మధ్య కూడా భారీ వ్యత్యాసం ఉంది. భారతీయుల తలసరి ఆదాయం తక్కువగా ఉండటంతో కారు ధరలు వారిని బాగా ప్రభావితం చేస్తున్నాయి. అదే సమయంలో మంచి స్టైల్‌, గ్లోబల్‌ బ్రాండ్‌ లభిస్తే వాటి వైపు మొగ్గు చూపుతారు. వీటిని ఒక ప్యాకేజీలా అందించడం అన్ని కంపెనీలకు సాధ్యం కాదు. మారుతీ సుజుకీ భారతీయుల నాడి పట్టుకొంది. చిన్న కార్ల నుంచి అతి చిన్న కార్ల వరకూ తన పోర్టు ఫోలియో ఉండేట్లు చూసుకొంది. భారత్‌ మార్కెట్లోకి మొట్టమొదట అడుగుపెట్టడం కూడా ఈ కంపెనీకి కలిసొచ్చింది. స్థానిక కంపెనీ మారుతీతో జట్టు కట్టడంతో ఇక్కడి వాళ్ల అవసరాలకు తగినట్లు వ్యూహాలను తయారు చేసే స్థానిక మేనేజ్‌మెంట్‌ బృందం వీరికి మొదట్లోనే లభించింది. మొదటి నుంచి మారుతీ సుజుకీ అధిక ఇంధన సామర్థ్యం ఉన్న వాహనాలను తయారు చేయడానికే ఎక్కువ మొగ్గు చూపింది. ఫలితంగా భారత కార్ల మార్కెట్లో దాదాపు 50శాతం వాటాను దక్కించుకొంది. భారత మార్కెట్లోకి కొంత ఆలస్యంగా అడుగుపెట్టిన హ్యూందాయ్‌ కూడా కొంతలో కొంత ఇదే ఫార్ములాను అనుసరించి 16శాతానికి పైగా మార్కెట్‌ షేర్‌తో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మహీంద్రా, టొయోటా, టాటా, హోండా కంపెనీలు కలిసి దాదాపు 22శాతానికి పైగా మార్కెట్‌పై పట్టుసాధించాయి. తొలి ఆరు స్థానాల్లో ఒక్క అమెరికా కంపెనీ కూడా లేదు. ఏడో స్థానంలో ఉన్న ఫోర్డు వాటా గత ఏడాది కంటే తగ్గి 2.69శాతానికి చేరింది. కొత్తగా మార్కెట్లో అడుగుపెట్టిన కియా మోటార్స్‌ ఒక్కటే మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసి టాప్‌-10లో చోటు దక్కించుకోవడం విశేషం. ఈ కంపెనీ భారతీయుల అభిరుచులకు తగినట్లు సెల్టోస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆలస్యంగా మార్కెట్లోకి వచ్చినా మంచి కాన్సెప్ట్‌తో వచ్చి ఆకట్టుకొంది. 

జీఎం ప్రస్థానం ఇలా.. 

1996లో ఒపెల్‌ బ్రాండ్‌తో మార్కెట్లోకి జీఎం ప్రవేశించింది. కానీ, ఇది భారతీయ వినియోగదారులను సంతృప్తి పర్చలేదు. దీంతో 2004లో టవేరాతో షవర్లె బ్రాండ్‌ను భారత్‌కు  పరిచయం చేసింది. ఇది బాగా విజయవంతమైంది. ఆ తర్వాత సెయిల్‌, స్పార్క్‌, క్రూజ్‌, బీట్‌, ఎంజాయ్‌, ట్రైల్‌ బ్లేజర్‌, కాప్టివా, ఫారెస్టర్‌, ఆప్ట్రా ఎస్‌ఆర్‌వీ, యావియో వంటి మోడళ్లను తీసుకొచ్చింది. వీటిల్లో క్రూజ్‌, బీట్‌ మార్కెట్‌ను బాగా ఆకట్టుకొన్నాయి. అప్పట్లో అతిచిన్న డీజిల్‌ కారుగా బీట్‌ సంచలనం సృష్టించింది. తక్కువ ధరలో డీజిల్‌ కారును ఇవ్వాలనే లక్ష్యంతో  చైనా  భాగస్వామి ఎస్‌ఏఐసీ కలిసి 2013లో సెయిల్‌ను తీసుకొచ్చింది. ఇది ఆశించిన విజయం సాధించలేదు. అక్కడి నుంచే  షవర్లే విక్రయాలు తగ్గడం మొదలయ్యాయి. 2010లో 4.7శాతం ఉన్న మార్కెట్‌ షేరు 2016 నాటికి 1శాతం కంటే తక్కువకు చేరింది. దీనికి తోడు సరైన కస్టమర్‌ సర్వీసింగ్‌ సెంటర్లు, డీలర్‌షిప్స్‌, స్పేర్లు అందుబాటులో ఉండవనే అపఖ్యాతిని మూటగట్టుకొంది. విక్రయాలు తగ్గడంతో డీలర్ల సంఖ్య మరింత తగ్గడం మొదలైంది. ఫలితంగా చివరికి 2017లో భారత్‌లో విక్రయాలను నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో గుజరాత్‌లోని హలోల్‌ ప్లాంట్‌ ఎంజీ మోటార్స్‌ చేతికి వచ్చింది. ఇది చైనాకు ఎస్‌ఏఐసీకి చెందిన బ్రిటిష్‌ బ్రాండ్‌. గతంలో ఈ ఎస్ఏఐసీ జీఎం మోటార్స్‌తో కలిసి పనిచేసింది. తెలంగాణలోని జీఎం  ప్లాంట్‌ కూడా దక్కించుకొనేందుకు చర్చలు జరుపుతోంది. జీఎం మోటార్స్‌ లాభదాయకంగా లేని మార్కెట్ల నుంచి నిష్క్రమించి కొత్త టెక్నాలజీలపై దృష్టిపెట్టాలని భావించింది.

24 ఏళ్ల పాటు ఉన్నా  ఆకట్టుకోలేక..
ఫోర్డు 1995లో మహీంద్రా అండ్‌ మహీంద్రాతో కలిసి భారత్‌లో జాయింట్‌ వెంచర్‌ ప్రారంభించి మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత దాదాపు 2 బిలియన్‌ డాలర్లను వెచ్చించి పూర్తిస్థాయి నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకొని సొంతగా  విక్రయాలు ప్రారంభించింది. కానీ 24 ఏళ్లలో 3శాతం వాటా మాత్రమే దక్కించుకోగలిగింది. ఫోర్డుకు భారత మార్కెట్‌ కొత్తేం కాదు. 1926లో ఒకసారి భారత మార్కెట్లో ప్రవేశించింది. ఆ తర్వాత 1950లో భారత మార్కెట్‌ నుంచి వైదొలగింది. ఇప్పుడు రెండోసారి రావడం. 2017-18లో రూ.526కోట్ల లాభాన్ని కళ్ల జూసేందుకు భారీగా వ్యయ నియంత్రణ చేయాల్సి వచ్చింది. మరోపక్క ఆటోమొబైల్‌ రంగం కూడా నెమ్మదిగా మందగమనంలోకి వెళ్లిపోయింది. దీంతో ఈ మార్కెట్‌లో నిలదొక్కుకోవడానికి మరో దేశీయ దిగ్గజం అండ తప్పనిసరిగా మారింది. ఫలితంగా మహీంద్రాతో కలిసి జేవీని అక్టోబర్‌లో ఏర్పాటు చేసింది.

ఇక్కడ ఇంకో విశేషం ఉంది.. భారత్‌కు చెందిన టాటామోటార్స్‌ వ్యాపారాన్ని తొలుత ఫోర్డుకు విక్రయిద్దామనుకున్నారు. కానీ, ఫోర్డు ప్రతినిధుల తీరుతో రతన్‌ టాటా మనస్తాపానికి గురై ఆ కంపెనీని పట్టుదలగా నడిపి భారత మార్కెట్లో నిలదొక్కుకున్నారు. ఫోర్డు నుంచి జేఎల్‌ఆర్‌ను కొనుగోలు చేశారు. ఫోర్డు మాత్రం భారత్‌లో నిలదొక్కుకోవడానికి కూడా ఇబ్బంది పడి చివరికి మళ్లీ దేశీయ దిగ్గజం మహీంద్రాతో కలిసింది.

వాస్తవానికి రెండూ.. టెక్నాలజీ, డిజైన్‌లో అగ్రశ్రేణి ప్రపంచస్థాయి కంపెనీలు అనడంలో సందేహంలేదు. ఎప్పుడూ టెక్నాలజీనే విజయం సాధించదు.. దానికి ఎకనమిక్స్‌ను కూడా జోడిస్తే విజయం సాధించవచ్చు అన్నది ఈ రెండు కంపనీల అనుభవాలు చెబుతున్న సారాంశం. ఈ సూత్రాన్ని మారుతీ, హ్యూందాయ్‌, మహీంద్రాలు బలంగా పాటిస్తాయి. అందుకే  భారతీయుల మనసు గెల్చుకొన్నాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.