‘భారత్‌ ఎందుకు’ అనుకున్నవారే ఇప్పుడు..
close

తాజా వార్తలు

Updated : 19/12/2020 19:49 IST

‘భారత్‌ ఎందుకు’ అనుకున్నవారే ఇప్పుడు..

దేశంపై ప్రపంచ దృక్కోణం మారింది

అసోచామ్‌ ఫౌండేషన్‌ వీక్‌లో ప్రధాని మోదీ

దిల్లీ:  తయారీ, పన్ను చెల్లింపులు, కార్మిక రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంస్కరణలతో భారత్‌పై ప్రపంచ దృక్కోణం మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఒకప్పుడు ‘భారత్‌ ఎందుకు’ అనుకున్న పెట్టుబడిదారులే.. ఇప్పుడు ‘భారత్‌ ఎందుకు కాకూడదు’ అనే స్థాయికి దేశం ఎదిగిందని కొనియాడారు. మహమ్మారి క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్‌కు రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు రావడమే ఇందుకు నిదర్శనమన్నారు. సంస్కరణలతో అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్‌ కేంద్రంగా మారుతోందని ఆయన అన్నారు. అసోచామ్‌ ఫౌండేషన్‌ వీక్‌ 2020 కార్యక్రమంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని కీలక ప్రసంగం చేశారు. 

‘గతంలో అధిక పన్నురేట్లు, కఠినమైన నిబంధనలు, కార్మిక చట్టాలతో భారత్‌లో పెట్టుబడులు ఎందుకు? అని పెట్టుబడిదారులు అనుకునేవారు. కానీ ఇప్పుడు కార్పొరేట్‌ పన్నులను గణనీయంగా తగ్గించడంతో భారత్‌లో ఎందుకు పెట్టుబడులు పెట్టకూడదు? అనుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో విదేశీ పెట్టుబడిదారులకు ఎర్రతివాచీ పరుస్తున్నాం. సరికొత్త ఆర్థిక వాతావరణం, స్టార్టప్‌లలో గణనీయమైన పెరుగుదల, ప్రయివేటు రంగంలో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడంతో ఇప్పుడు భారత్‌పై ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం పెరిగింది’ అని మోదీ చెప్పుకొచ్చారు. సంస్కరణలతో నవ భారత్‌.. ఆత్మనిర్భర్ భారత్‌గా ఎదుగుతోందని అన్నారు. 

ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం ప్రభుత్వం తయారీ రంగంపై దృష్టిపెట్టిందని, ఈ రంగానికి ఊతమిచ్చేలా అనేక ప్రోత్సాహకాలు కల్పిస్తోందని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచం నమ్మకంగా ఉందని, అందుకే మహమ్మారి సమయంలోనూ దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని అన్నారు. 

మరో పారిశ్రామిక విప్లవం

ప్రపంచం మరో పారిశ్రామిక విప్లవం దిశగా కదులుతోందని, అందువల్ల ఇప్పటినుంచే మనం ప్రణాళికలు రూపొందించుకొని, లక్ష్య సాధనకు చర్యలు చేపట్టాలని మోదీ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. భారత్‌ స్వావలంభన సాధించేందుకు పారిశ్రామిక రంగం అన్ని ప్రయత్నాలు చేయాలన్నారు. ఉత్తమమైన కార్పొరేట్‌ పాలన, లాభాలను పంచుకునే విధానాలను పాటించాలని సూచించారు.  అధ్యయనం- అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ)లో ప్రయివేటు పెట్టుబడులు పెరగాలని కోరారు. ‘అమెరికాలో ఆర్‌అండ్‌డీలో 70శాతం ప్రయివేటు పెట్టుబడులే ఉంటాయి. అదే భారత్‌లో ప్రబుత్వ పెట్టుబడులున్నాయి. ఆర్‌అండ్‌డీలో ప్రయివేటు రంగ పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని ప్రధాని అభిప్రాయపడ్డారు. 

రైతుల ప్రయోజనాల కోసమే సంస్కరణలు

ఈ సందర్భంగా కొత్త సాగు చట్టాలను కూడా మోదీ ప్రస్తావించారు. ఆరు నెలల క్రితం వ్యవసాయ చట్టాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు రైతులకు అనేక ప్రయోజనాలు కల్పిస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. కొత్త చట్టాలతో రైతులు తమ పంటలను ఎక్కడైనా, ఎవరికైనా, ఎంత ధరకైనా అమ్ముకోవచ్చని మోదీ మరోసారి స్పష్టంచేశారు. 

ఇవీ చదవండి.. 

రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించాలి

పెట్టుబడులకు అవకాశాలు మెరుగవ్వాలి


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని