close

తాజా వార్తలు

Updated : 18/09/2020 14:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హర్‌సిమ్రత్‌ రాజీనామా వెనక ఏం జరిగింది?

దిల్లీ: తన చిరకాల మిత్ర పక్షం శిరోమణి అకాలీదళ్‌ నుంచి అధికార భాజపాకు వ్యతిరేకత ఎదురైంది. గురువారం పార్లమెంట్‌లో వ్యవసాయ రంగ బిల్లులను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ ఎంపీ, కేంద్రమంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ మంత్రి వర్గానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లులతో ప్రధానంగా పంజాబ్‌, హరియాణా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ప్రతిపక్షాలతోపాటు, రైతులు కూడా ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో ఆమె పదవికి రాజీనామాకు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ మాటలను బట్టి చూస్తే.. భవిష్యత్‌లో భాజపాతో కలిసి పని చేసే అవకాశాలు కూడా అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి. శివసేన తర్వాత అతిపెద్ద మిత్రపక్షమైన అకాలీదళ్‌ వ్యతిరేకిస్తున్నప్పటికీ భాజపా మొండిగా ముందుకెళ్లింది. ఈ క్రమంలో ‌కౌర్‌ రాజీనామాకు ముందు ఏం జరిగిందనే విషయాలను ఓ సారి పరిశీలిస్తే..!

రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహక, సులభతర) బిల్లు, రైతుల (సాధికారత, రక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద బిల్లు, నిత్యావసర సరకుల(సవరణ) బిల్లులను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశ పెట్టింది. నిత్యావసర సరకుల బిల్లు మంగళవారమే ఆమోదం పొందింది. మిగిలిన రెండు బిల్లులపై గురువారం చర్చ జరిగింది. తర్వాత వీటిని రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుల వల్ల అన్నదాతలకు మరిన్ని సౌకర్యాలు లభిస్తాయని అధికార భాజపా చెబుతోంది. గతంలో ఈ బిల్లులకు సంబంధించిన ఆర్డినెన్స్‌లకు అకాలీదళ్‌ మద్దతిచ్చింది. కానీ, రాష్ట్రంలోని రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పంజాబ్‌ రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఆందోళనలకు దిగారు. దీంతో రాజకీయంగా పట్టుకోల్పోతున్న అకాలీదళ్‌కు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరోవైపు అధికార భాజపాకు మిత్రపక్షంగా ఉండి కూడా రాష్ట్రానికి నష్టం చేకూర్చే బిల్లులను ఆపలేకపోతున్నారని ప్రతిపక్షాల నుంచి కూడా ఒత్తిడి ఎక్కువైంది. ఇటు రాష్ట్రంలో రైతులకు అనుకూలంగా వ్యవహరిస్తూ.. అటు కేంద్రంతోనూ సంబంధాలు కొనసాగించాలని అకాలీదళ్‌ భావించింది. ఈ క్రమంలోనే వ్యవసాయ బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పటికీ.. పంజాబ్‌, హరియాణా రాష్ట్రాలకు రిజర్వేషన్లు కల్పించాలని అకాలీదళ్‌ నుంచి ఏకైక కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు తన ఆలోచనను కేబినెట్‌ ముందుంచారు. అయితే భాజపా దీనిని పరిగణనలోకి తీసుకోలేదు.

దీంతో అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌కు అసహనం కట్టలు తెంచుకుంది. ఆయన సూచన మేరకు కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ తన పదవికి రాజీనామా చేశారు. రైతుల నమ్మకాన్ని శిరోమణి అకాలీదళ్‌ ఎప్పటికీ వమ్ము చేయదని ప్రకటించారు. అంతకు ముందే ఈ విషయాన్ని ఆమె భర్త సుఖ్‌బీర్‌‌ లోక్‌సభలో ప్రకటించారు. భాజపాతో కలిసి ఇన్నాళ్లూ అడగులేసినందుకు విచారం వ్యక్తం చేశారు. అయితే, ఓ పక్క అధికార భాజపాకు రాజకీయంగా కొంత నష్టం వాటిల్లుతున్నప్పటికీ ఈ మూడు బిల్లుపై మొండిగా ఎందుకు ముందుకెళ్లిందన్నది కాస్తా ఆలోచించదగిన విషయమే. ఇప్పటికే శివసేనతో సంబంధాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్న భాజపా తాజాగా మరో అతిపెద్ద మిత్రపక్షాన్ని కోల్పోయేందుకు కూడా ఎందుకు సిద్ధమైందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.