
తాజా వార్తలు
భార్య శాంపిళ్లను పనిమనిషి పేరిట పంపి..
బుక్కయిన ప్రభుత్వ వైద్యుడు
భోపాల్ : తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఓ వైద్యుడి చేసిన నిర్వాకం అతడిపై పోలీసు కేసు నమోదయ్యేటట్లు చేసింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న తన భార్య శాంపిళ్లను ఇంట్లో పనిమనిషి పేరిట పంపి పోలీసులకు చిక్కాడు ఆ వైద్యుడు. మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు..
సింగ్రౌలి ప్రాంతంలో ప్రభుత్వ వైద్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి ఇటీవల కుటుంబసభ్యులతో కలిసి ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ పెళ్లికి హాజరయ్యాడు. పై అధికారులు సెలవులు ఇవ్వకపోయినప్పటికీ యూపీకి వెళ్లాడు. జూన్ 23న వివాహానికి హాజరై.. జులై 1న స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. నిబంధనల ప్రకారం హోం క్వారంటైన్లో ఉండక.. విధులకు హాజరయ్యాడు. ఆ తర్వాత తన భార్యలో కొవిడ్ లక్షణాలు కనిపించాయి. అయితే ఆమెకి నిర్ధారణ పరీక్షలు చేయిస్తే.. తాను యూపీ వెళ్లి వచ్చిన విషయం బయటపడుతుందని ఓ ఉపాయం ఆలోచించాడు. తన భార్య శాంపిళ్లను ఇంట్లో పనిమనిషి పేరిట పంపించాడు.
అయితే పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అధికారులు పనిమనిషి ఇంటికి చేరడంతో.. ఆ వైద్యుడి మోసం బయటపడింది. అనంతరం అతడి కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించగా.. వైద్యుడితోపాటు ఇంట్లోని మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు, ఇతరుల పేరుతో శాంపిళ్లను పంపినందుకు ఆ వైద్యుడిపై ‘ఎపిడమిక్ చట్టం’ కింద కేసు నమోదు చేశారు. అతడు ఆస్పత్రి నుంచి కోలుకుని తిరిగి రాగానే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
మరోవైపు ఆ వైద్యుడికి కరోనా సోకిన కారణంగా అతడి కార్యాలయంలో పనిచేసే 33 మంది సిబ్బంది ఐసోలేషన్లోకి వెళ్లాల్సి వచ్చింది.