
తాజా వార్తలు
బిడ్డ పెళ్లి లొల్లి.. తెగిన తల్లి తాళి!
భర్తనే చంపేసిన ఇల్లాలి లొంగుబాటు!
గురంధరపాలెం (నర్సీపట్నం గ్రామీణం), న్యూస్టుడే: కూతురును రోజుల కిందటే అత్తవారింటికి సాగనంపారు. తమ బాధ్యత తీరిందని ఆ తల్లిదండ్రులు సంతోషంలో ఉన్నారు. అంతలోనే అల్లుడి కుల వివాదం వీరి మధ్య చిచ్చు రేపింది. పచ్చని తోరణాలు ఆ ఇంటి ముందు వాడక ముందే.. పెళ్లి కళ వీడక ముందే వధువు తల్లి భర్తనే హత్య చేసి కటకటాలపాలైంది. సమాజం ముందు నిందితురాలిగా మిగిలిపోయింది. గురంధరపాలెంలో వ్యవసాయ కూలీ విసారపు చిరంజీవి (48) హత్యకేసులో అతని భార్య సన్యాసమ్మ (40) శుక్రవారం వీఆర్వో రాజేశ్వరి ముందు లొంగిపోయింది. డీఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం సాయంత్రం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఈ ఘటన వివరాలను వెల్లడించారు.
డీఎస్పీ కథనం ప్రకారం..
ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయికి ఐదేళ్ల క్రితమే వివాహం చేశారు. చిన్నమ్మాయిని ఈనెల 3న మాకవరపాలెం మండలం పైడిపాలకు చెందిన అడ్డూరి చంటబ్బాయికి ఇచ్చి వివాహం చేశారు. వివాహమైన నాలుగు రోజుల తర్వాత అతను వేరే కులానికి చెందిన వాడని వీరికి తెలిసింది. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య వివాదం జరుగుతోంది. ఈనెల 11న ఆడపడుచు కొండపల్లి పార్వతి ఇంటివద్ద పెద్దలతో పంచాయితీ జరిగింది. కుల ధ్రువీకరణ పత్రం కోసం అల్లుడి కుటుంబసభ్యులను డిమాండ్ చేసినా చూపలేకపోయారు. దీంతో తమ పరువు పోయిందని భార్యాభర్తలు ఆందోళన చెందుతున్నారు. ఈనెల 15న మూడు గంటలకు భార్య సన్యాసమ్మ కత్తి తీసుకొని పొలంలోని పాకవద్దకు వెళ్లింది. అక్కడ ఇద్దరూ ఘర్షణపడ్డారు. కత్తితో భర్తపై దాడి చేయడంతో ఆయన మరణించారు. కత్తిని అక్కడే పడేసి, రక్తపు మరకలను శుభ్రం చేసుకుని ఇంటికి వెళ్లిపోయింది. తన భర్త హత్యకు గురైనట్టు తొలుత ఫిర్యాదు చేసినా ఇప్పుడు లొంగిపోయిందని డీఎస్పీ వివరించారు. ఆమెను అరెస్టు చేశామని వెల్లడించారు. సీఐ అప్పలనాయుడు, ఎస్సై రవికుమార్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.