close
Array ( ) 1

తాజా వార్తలు

మహిళలకు బ్రహ్మాస్త్రం ‘దిశ’ చట్టం

అమరావతి: ఏపీ అసెంబ్లీలో ‘దిశ’ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. హోంమంత్రి సుచరిత అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశ పెట్టగా అధికార, విపక్ష సభ్యులంతా దీనిపై చర్చించి తన అభిప్రాయాలను చెప్పడంతో పాటు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారిపై కేసు నమోదైన తర్వాత 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి 21 రోజుల్లో శిక్ష పడేలా ‘దిశ’ బిల్లును రూపొందించిన విషయం తెలిసిందే. ప్రతి జిల్లాలో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను కూడా ఏర్పాటు చేయనున్నారు. మహిళలు, చిన్నారులపై క్రూరమైన నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించేలా బిల్లులో పొందుపరిచారు. సామాజిక మాధ్యమాలు, ఫోన్లలో మహిళల గురించి అసభ్యంగా మాట్లాడినా, ప్రవర్తించినా రెండేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధించే నిబంధనలు సూచించారు. ఈ నేపథ్యంలో ఈ బిల్లుపై ముఖ్యంగా మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం మాట్లాడారో ఓసారి పరిశీలిస్తే..


జగన్‌.. దమ్మున్న సీఎం

‘మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని ఎవరూ అడిగే వారు లేరన్న పొగరుతో మరింత రెచ్చిపోతున్నారు. మహిళల తరఫున నిలబడే చట్టం ఒకటి ఉందనీ.. ఆ చట్టాన్ని అమలు చేసే దమ్మున్న సీఎం జగన్‌ అనే నమ్మకం మహిళా లోకానికి ఈ రోజు కలిగింది. ఇప్పటిదాకా దేశంలో అనేక చట్టాలు ఉన్నాయి. నిర్భయ, పోక్సో, వరకట్న వేధింపుల చట్టం, ఐపీసీ, న్యాయ వ్యవస్థ, పటిష్టమైన పోలీస్‌ వ్యవస్థ.. అన్నీ ఉన్నాయి.  కానీ ‘దిశ’ హత్య తర్వాత ఆ చట్టాలు శిక్షిస్తాయన్న నమ్మకం ఎవరికీ కలగలేదు. అందుకే దిశను చంపిన మృగాళ్లు తక్షణమే చావాలని దేశంలోని ప్రతి మహిళా గొంతెత్తి నినదించింది. వారిని దారుణంగా ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీకసులను అంతా కీర్తించే పరిస్థితిని మనం చూశాం. చట్టమంటే భద్రత, భయం రెండూ కలిగించాలి. ఈ పరిస్థితుల్లో మార్పులు తెచ్చేందుకు సీఎం జగన్‌ గొప్ప చట్టం తీసుకొచ్చారు’’- పుష్పశ్రీవాణి, డిప్యూటీ సీఎం


మహిళా లోకం హర్షిస్తోంది

‘‘మా మహిళలందరికీ అండగా ఉండేందుకు సీఎం జగన్‌ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. మహిళలకు దేశంలో భద్రత లేకుండా పోయింది. భరోసా ఇస్తూ ఇలాంటి చట్టం తేవడంపై మహిళాలోకం హర్షిస్తోంది. 2012లో నిర్భయ కేసు, ఇటీవల దిశ కేసును చూశాం. ఇవన్నీ మీడియా ముందుకు రావడం వల్లే ప్రపంచానికి తెలుస్తోంది. కానీ నిత్యం ఎంతోమంది బాలికలు, చిన్నారులు ఇలాంటి దారుణాలకు బలైపోతున్నారు. ఇలాంటి దారుణాలపై చట్టం తేవాలని జగన్‌కు ఎవరూ చెప్పలేదు. మానవత్వంతో వ్యవహరించి ఈ చట్టం తెచ్చారు. దిశ ఘటనలో నిందితులను వెంటనే శిక్షించాలని ముక్తకంఠంతో అన్నారు. వెంటనే ఎన్‌కౌంటర్‌ చేయాలనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. చిన్నారులపై జరుగుతున్న దాడులను చూస్తుంటే దోషుల్ని తక్షణమే చంపే పరిస్థితి ఉంటే బాగుండుననే అభిప్రాయం ఒక మహిళగా, తల్లిగా నాకూ కలిగింది. అత్యాచారాలకు గురవుతున్న మహిళలు, బాలికలకు అండగా ఉంటూ జగన్‌ మంచి చట్టం తీసుకురావడం ధైర్యాన్నిచ్చింది. మహిళలు ఎంతో సంతోషిస్తున్నారు. మహిళలపై లైంగిక దాడులు జరుగుతుంటే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు బీటలు వారుతున్నాయి. ఇలాంటి సంస్కృతి అంతరించాలంటే సమగ్రమైన, వేగవంతమైన దర్యాప్తు అవసరం. దోషులకు కఠిన శిక్షలు వేయాలి’’ - తానేటి వనిత, స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి


సంచలన నిర్ణయాలతో విప్లవాత్మక మార్పులొస్తాయ్‌

‘‘దిశ చట్టం మహిళలకు ఇది రక్షణ కవచం. ఈ పేరుతో చట్టం తీసుకురావడం ఆనందదాయకం. ఇకపై సోషల్‌ మీడియాలో మహిళల్ని ఎవరైనా అగౌరవపరుస్తూ తప్పుడు రాతలు రాస్తే శిక్షలు అమలుచేసే చట్టం తేవడం హర్షనీయం. ఇలాంటి బిల్లు తీసుకురావడం ఓ గొప్ప సాహసం. సమాజంలో విప్లవాత్మక మార్పులు రావాలంటే సంచలన నిర్ణయాలు ఉండాలి. వరకట్నం, గృహ హింస చట్టాలు తీసుకొచ్చాక మహిళలపై అత్తింటి వేధింపులు చాలా వరకు తగ్గాయి. వరంగల్‌లో విద్యార్థినిపై ముగ్గురు యువకులు యాసిడ్‌ పోస్తే నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారు. ఆ తర్వాత యాసిడ్‌ దాడులు చాలా వరకు తగ్గిపోయాయి. సంచలన నిర్ణయాలు తీసుకుంటే సమాజంలో కచ్చితంగా విప్లవాత్మకమైన మార్పులు వస్తాయనేందుకు ఇలాంటి ఉదాహరణలే సాక్ష్యం. ఈ చట్టం ఏపీలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని విశ్వసిస్తున్నా. కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నా.. ‘దిశ’ చట్టంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. మహిళా మిత్ర, సైబర్‌ మిత్ర కార్యక్రమంలో దిశ చట్టాన్ని కూడా చేర్చి పోలీసులు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమంలో భాగంగా దీని గురించి వివరిస్తే బాగుంటుంది. రాష్ట్రంలోని అన్ని గ్రామ సచివాలయాలు, పోలీస్‌ స్టేషన్లు, పాఠశాలలు, కళాశాలల్లో ఈ చట్టాన్ని వివరిస్తూ పెద్ద పెద్ద బోర్డులు ఏర్పాటు చేయాలి. కొన్ని రోజులు ప్రకటనలు కూడా జారీచేస్తే బాగుంటుంది. ప్రచార రథాల ద్వారా గ్రామాల్లోని ప్రజలకు వివరిస్తే ఫలితం ఉంటుంది. ‘దిశ’ చట్టం ప్రతి మహిళ చేతిలో ఒక బ్రహ్మాస్త్రం.’’ - విడదల రజని, చిలకలూరిపేట ఎమ్మెల్యే


కఠిన శిక్షలతోనే నేరాలు ఆగుతాయ్

‘‘మహిళలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మన పెద్దలు చెబుతుండేవారు. కానీ సమాజంలో తిరుగుతున్న కొందరు మృగాళ్ల వల్ల పెద్దల మాటలన్నీ నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఏ మూల చూసినా మహిళలు దాడులకు గురవుతున్నారు. అలాంటి నేరస్థులకు కఠిన శిక్షలు అమలు కాకపోవడం వల్లే ఈ పరిస్థితి. ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై అత్యాచారాలు చేసి భయానకంగా వారిని హత్య చేస్తున్నారు. ఇలాంటి ఘటనలతో గుండె తరుక్కుపోతుంది.  ఇలాంటి నేరాలు జరగకుండా ఉండాలంటే నేరస్థులపై కఠిన చర్యలతో పాటు ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఆలోచనా విధానంలో మార్పు రావాలి. విద్యా బోధనలో కూడా  మహిళల పట్ల గౌరవం, కుటుంబంలో విలువలు పెంచేలా చర్యలు తీసుకోవాలి. దీంతో పాటు ముఖ్యంగా సినిమాలు తీసేటప్పుడు, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసే వీడియోల్లోని సన్నివేశాలు మహిళల పట్ల గౌరవం పెంచేలా ఉండాలి. తెదేపా ఎప్పుడూ మహిళల పక్షపాతిగా ఉంటూ వస్తోంది. సమాజంలో నేరాలు తగ్గాలంటే  ఇలాంటి చట్టాలు రావాల్సిందే. దిశ చట్టాన్ని తెదేపా స్వాగతిస్తోంది. చట్టాలు చేయడంతోనే సరిపెట్టుకోకుండా అవి చిత్తశుద్ధితో అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.’’- ఆదిరెడ్డి భవానీ, తెదేపా ఎమ్మెల్యే, రాజమహేంద్రవరం సిటీ

ఈ చర్చలో వైకాపా మహిళా ఎమ్మెల్యేలు నాగులపల్లి ధనలక్ష్మీ, విశ్వసరాయి కళావతి, కేవీ ఉషశ్రీ చరణ్‌, ఉండల్లి శ్రీదేవి, రెడ్డి శాంతి తదితరులు పాల్గొన్నారు. ఈ చట్టం మహిళలకు ఎంతో ధైర్యాన్నిస్తుందని హర్షం వ్యక్తంచేశారు. ఈ బిల్లు తెచ్చేందుకు చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు చెప్పారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.