సాలూరు గిరిజనులకు సోనూసూద్‌ అభినందన
close

తాజా వార్తలు

Updated : 24/08/2020 19:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సాలూరు గిరిజనులకు సోనూసూద్‌ అభినందన

విజయనగరం: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా సాలూరు మండలం మారుమూల ప్రాంతమైన కొదమ గ్రామ గిరిజనులు స్వచ్ఛందంగా చేపట్టిన రహదారి నిర్మాణంపై బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. కొదమ పంచాయితీలో 150 కుటుంబాలు ఉన్నాయి. అయితే, ఆ కుటుంబాలు నిత్యావసర వస్తువులు తీసుకెళ్లేందుకు, రోగులను ఆసుపత్రికి తరలించేందుకు సరైన రోడ్డు, రవాణా సౌకర్యం లేదు. ఏ చిన్న అవసరం వచ్చినా కొండలు, గుట్టల్లో కాలి నడకన వెళ్లాల్సిందే. నిత్యావసరాల కోసం ఒడిశా సరిహద్దులో 4కి.మీ దూరాన ఉన్న బారి గ్రామంలోని సంతకు కాలినడకనే వెళ్తుంటారు. ఇక గర్భిణికి పురిటి నొప్పులు వస్తే అంతే సంగతులు. అలాంటి సందర్భాల్లో గ్రామస్థులు డోలీ కట్టి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వారిని సమీప ఆసుపత్రికి తీసుకెళ్తుంటారు.

ఈ నేపథ్యంలో గ్రామస్థులంతా కలిసి సంతకు వెళ్లే బారి గ్రామం వరకైనా రహదారిని నిర్మించుకోవాలని సంకల్పించారు. ఈ క్రమంలో ఒక్కో ఇంటికి రూ.రెండు వేలు చొప్పున చందాలు సేకరించి రెండు జేసీబీలను అద్దెకు తీసుకుని రెండు వారాలపాటు శ్రమించి కొండను తొలిచారు. మరో వారం రోజుల పాటు మట్టివేసి నాలుగు కిలోమీటర్ల మేర రహదారిని ఏర్పరుచుకున్నారు. వీరి శ్రమపై ఈనాడు-ఈటీవీలో కథనం ప్రసారమైంది. ఈ కథనాన్ని చూసిన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలోని ప్రజా చైతన్య వేదిక అనే స్వచ్ఛంద సంస్థ బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌కు ట్విటర్‌ ద్వారా చేరవేసింది. విషయం తెలుసుకున్న సోనూ.. కొదమ గ్రామ గిరిజనులను అభినందించారు. యావత్‌ దేశాన్ని మీ స్ఫూర్తి ప్రేరేపిస్తుందని కొనియాడారు. మీ ప్రేరణ దేశం మొత్తం అనుసరించాలని.. అందరం కలిసి కట్టుగా ఇలాంటి కార్యక్రమాలు చేద్దామంటూ సోనూసూద్‌ పిలుపునిచ్చారు. త్వరలో కొదమ గ్రామాన్ని సందర్శించనున్నట్లు ఆయన తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని