close

తాజా వార్తలు

Updated : 13/04/2021 17:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కన్నకొడుకే మోసం చేసిన ఓ దగా కథ!

దిక్కులేని స్థితిలో ఓ వైద్యుడి చరమాంకం

విశాఖపట్నం: ఆయన ఓ వైద్యుడు. కొన్ని దశాబ్దాలపాటు పదిమందికీ వైద్యసేవలు అందించి మంచి పేరు సంపాదించాడు. కానీ జీవిత చరమాంకంలో దీనస్థితిలో బతుకు వెళ్లదీస్తున్నాడు. భార్య మరణం, కూతుళ్ల బాధ్యత, కొడుకు చేసిన మోసంతో మానసికంగా కుంగిపోయాడు. ఆస్తి రాయించుకున్న కుమారుడు వదిలేయడంతో రోడ్డు పక్కనే బతుకీడిస్తూ.. అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నాడు.

ఆయన పేరు డా.దశరథరామ్‌. గతంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడిగా సేవలందించారు. ఇప్పుడు విశాఖలోని సీతమ్మదార డాక్టర్స్‌ కాలనీలో దిక్కులేని వ్యక్తిగా జీవితం వెళ్లదీస్తున్నారు. మతి స్థిమితంగా లేకపోవడంతో ఎవరినీ సాయమడిగే పరిస్థితిలోనూ లేరు. పదవీ విరమణ అనంతరం మద్దెలపాలెంలో సొంతంగా క్లినిక్‌ నడిపారు. సీతమ్మదార వుడా అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌లో అద్దెకు ఉండేవారు. ఒడుదొడుకులు తట్టుకుంటూ జీవితం వెళ్లదీసిన ఆయన.. ఏడు నెలల క్రితం భార్య మరణంతో మానసికంగా కుంగిపోయారు. అద్దెకున్న అపార్ట్‌మెంట్‌ను యజమాని ఖాళీ చేయించడంతో సమీపంలోని దుకాణాన్నే నివాసంగా మార్చుకున్నారు. ప్రస్తుతం ఆసలేం జరుగుతుందో తెలియని స్థితిలో ఆయన ఉన్నారు. ఉద్యోగ జీవితం గురించి తప్ప ఇతర విషయాలేవీ గుర్తులేవంటున్నారు.

ఇద్దరు కూతుళ్లూ ఆయన దగ్గరే..

డా.దశరథరామ్‌కు ముగ్గురు సంతానం. ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. ముగ్గురూ పెళ్లి చేసుకొని స్థిరపడ్డారు. ఉద్యోగ విరమణ అనంతరం కుమారుడి వద్దే ఉన్న ఆయన.. ఆ తర్వాత బయటకు రావాల్సి వచ్చింది. అదే సమయంలో కూతుళ్లు కూడా కట్టుకున్నవారి ఆలనాపాలనా కరవై తండ్రి దగ్గరకే వచ్చేశారు. చిన్నకుమార్తె మానసిక స్థితి సరిగా లేకపోవడంతో.. విశాఖ మానసిక వైద్యశాలలో చేర్చారు. తండ్రి, పెద్దకుమార్తె ఆశ్రమంలో ఉండేవారు. అక్కడి పరిస్థితులు నచ్చకపోవడంతో ఓ అపార్ట్‌మెంట్‌ అద్దెకు తీసుకొని ముగ్గురూ అందులోకి మారారు. చిన్నకుమార్తె మానసిక స్థితి బాగాలేక చుట్టుపక్కల వారితో గొడవలు జరుగుతుంటే.. అపార్ట్‌మెంట్‌ యజమాని ఖాళీ చేయించారు. ఇదే అదనుగా కుమారుడు మాధవ్‌ హైదరాబాద్‌ నుంచి వచ్చి.. ఆస్తి రాయించుకున్నాడని.. విలువైన సామాన్లు  తీసుకెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇప్పుడు సమస్య చెబుదామంటే.. ఫోన్‌ కూడా తీయడం లేదని దశరథరామ్‌ పెద్దకుమార్తె వాపోతున్నారు.

భార్య మరణమే కారణమా?

భార్య మరణమే దశరథరామ్‌ కష్టాలకు కారణమని స్థానికులు అంటున్నారు. ఆరునెలల క్రితం వరకు ఆయన ప్రాక్టీస్‌ కొనసాగించారని చెబుతున్నారు. డాక్టర్‌ అవస్థలు చూసి స్థానికులు ఎంతో కొంత సాయం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న విశాఖ మహానగర పాలక సంస్థ అధికారులు ఆయనకు ఆశ్రయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 80 ఏళ్ల వయస్సులో డా.దశరథరామ్‌ కష్టాలను చూసి అందరూ చలించిపోతున్నారు.



 

ఇవీ చదవండి


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని