రెండు బస్సులు, లారీ ఢీ.. ముగ్గురి మృతి
close

తాజా వార్తలు

Updated : 29/03/2021 12:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండు బస్సులు, లారీ ఢీ.. ముగ్గురి మృతి

రింగురోడ్డు(విజయనగరం): విజయనగరం జిల్లాలో ఈ ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఆర్టీసీ బస్సులు, లారీ ఒకదాన్నొకటి ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విజయనగరం మండలం సుంకరిపేట వద్ద విశాఖ, విజయనగరం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. టైరు పేలి విజయనగరం బస్సును విశాఖ బస్సు ఢీకొంది. ఇంతలో వెనుక నుంచి వస్తున్న గ్యాస్‌ సిలిండర్ల లారీ విజయనగరం బస్సును ఢీకొంది. మూడు వాహనాలు పరస్పరం ఢీకొనడంతో ఒకే ఆర్టీసీ బస్సులో ఉన్న ఇద్దరు డ్రైవర్లు ఎస్‌.ఆశీర్వాదం(58), దేవుడు(55), మరో ప్రయాణికుడు మృతిచెందారు. ప్రమాదంలో మరో 40 మందికి గాయాలైనట్లు డీఎస్పీ అనిల్‌ కుమార్‌ తెలిపారు. 

సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం 10 మందిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. మృతిచెందిన ఆశీర్వాదం స్వస్థలం విజయనగరం బొగ్గులదిబ్బ, దేవుడిది గంట్యాడ మండలం లక్కిడాం ప్రాంతాలుగా పోలీసులు గుర్తించారు. కాగా, ఆశీర్వాదం మరో గంటలో డ్యూటీ దిగాల్సి ఉండగా.. దేవుడు డ్యూటీ ఎక్కాల్సి ఉండటంతో ఇద్దరూ ఒకే బస్సులో ప్రయాణించారు.

ఘటన జరిగిన ప్రాంతంలో డంపింగ్‌ యార్డు ఉండటంతో చెత్తను తగులబెట్టారు. దీంతో పొగ రహదారిని కమ్మేసింది. ఈ సమయంలో అటుగా వచ్చిన వాహనాలకు దారి కనిపించలేదు. దీంతో పాటు వాహనాల అతివేగం ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్‌ కిషోర్‌ కుమార్‌, ఎస్పీ రాజకుమారి సంఘటనా ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. 

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి: సీఎం 

రోడ్డు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి జగన్‌ ఆరా తీశారు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. 

మంత్రి పేర్ని నాని ఆరా

రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి పేర్ని నాని ఆరా తీశారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో మాట్లాడారు. సహాయక కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. బస్సు ప్రమాదాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

పలువురి దిగ్భ్రాంతి

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంపై తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని