డాడీ.. ‘ఎప్పుడూ దెబ్బలు తింటావేంటి?
close

తాజా వార్తలు

Published : 29/09/2020 13:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డాడీ.. ‘ఎప్పుడూ దెబ్బలు తింటావేంటి?

‘‘నటుడిగా నేనెన్ని ఘనతలు సాధించినా.. ఎంత ఎత్తుకు ఎదిగినా ప్రతిదీ నా దర్శకుల చలవే’’ అంటున్నారు నటుడు అజయ్‌. ‘ఒక్కడు’, ‘సై’, ‘విక్రమార్కుడు’, ‘ఇష్క్‌’, ‘దూకుడు’, ‘గబ్బర్‌ సింగ్‌’, ‘అఆ’.. ఇలా ఎన్నో హిట్‌ చిత్రాల్లో ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించారాయన. ఇటీవలే ‘అల.. వైకుంఠపురములో’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ చిత్రాలతో అలరించారు. ఆయన నటుడిగా తెరపై మెరిసి ఈ ఏడాదితో 20వసంతాలు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత, సినీ జీవిత విశేషాలను పంచుకున్నారు అజయ్‌.

ఇన్నేళ్ల సినీ ప్రయాణాన్ని వెనక్కు తిరిగి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది?

అజయ్‌: ‘కౌరవుడు’ ‘ఖుషీ’ దగ్గర నుంచి ఇటీవల వచ్చిన ‘భీష్మ’ వరకు ఈ 20ఏళ్ల సినీ ప్రయాణాన్ని వెనక్కు తిరిగి చూసుకుంటే.. కాలం చాలా వేగంగా గడిచిపోయినట్లనిపిస్తోంది. మనసుకు నచ్చిన రంగంలో ఇన్నేళ్లుగా సాఫీగా ప్రయాణం సాగిస్తున్నందుకు ఒకింత గర్వంగా, ఎంతో సంతోషంగా ఉంది. ఎంతో మంది గొప్ప దర్శకులు నాకిచ్చిన చక్కటి పాత్రలు, ప్రేక్షకుల ప్రేమాభిమానాలే ఈరోజు నన్నింత వరకు తీసుకొచ్చాయి.

కెరీర్‌ తొలినాళ్లలో సినిమా కష్టాలేమైనా ఎదుర్కొన్నారా?

అజయ్‌: చదువును మధ్యలో ఆపేసి ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూల్‌లో చేరిపోయా. అదృష్టవశాత్తూ నటనలో శిక్షణ తీసుకున్న ఏడాదికే ‘కౌరవుడు’తో తెరపైకొచ్చే అవకాశం దొరికింది. వెంటనే పవన్‌ కల్యాణ్ సర్‌ ‘ఖుషీ’ చిత్రంలో చేశా. పెద్దగా కష్టాలు పడకున్నా..‘ఈ  రంగంలో నిలదొక్కుకుంటానా? లేదా?’ అని రెండేళ్ల పాటు మానసికంగా ఒత్తిడికి గురయ్యా. ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘సై’ లాంటి సినిమాల తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

నటుడిగా మీకు బాగా సవాల్‌ అనిపించిన పాత్రలేమైనా ఉన్నాయా?

అజయ్‌: చాలా ఉన్నాయి. ప్రత్యేకంగా అంటే రాజమౌళి సర్‌ దర్శకత్వంలో చేసిన ‘విక్రమార్కుడు’. ప్రతినాయకుడిగా, నటుడిగా నాకు చాలా గొప్ప పేరు తీసుకొచ్చింది. ఆ సినిమాలో టిట్లా పాత్ర కోసం చాలా కష్టపడ్డా. ‘ఇష్క్‌’, ‘అతనొక్కడే’, ‘ఆర్య 2’, ‘పోకిరి’, ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘అఆ’, ‘24’, ‘జనతా గ్యారేజ్‌’ సినిమాల్లోని పాత్రలూ నటుడిగా నాకెంతో సంతృప్తినిచ్చాయి.

మధ్యలో ‘సారాయి వీర్రాజు’తో హీరోగా ప్రయత్నించినట్లున్నారు కదా? ఆ ఆలోచన ఎవరిది?

అజయ్‌: ఆ కథ నచ్చి నేనే ప్రయత్నించా. నిజానికి ఆ సినిమాకు ముందు ‘ఆ ఒక్కడే’ పేరుతో హీరోగా ఒక సినిమా చేశా. ఆ తర్వాత ‘సారాయి వీర్రాజు’ చేశా. ఈ చిత్రం కోసం కష్టపడినా ఫలితం రాలేదు. తర్వాత ఇవన్నీ మనకు సెట్‌ కావనిపించింది. దాంతో మళ్లీ అలాంటి ప్రయోగాల జోలికి పోలేదు.

దర్శకత్వం వైపు వెళ్లే ఆలోచనలున్నాయా?

అజయ్‌: ఓటీటీ వేదికలొచ్చాక.. నటుడిగా నాకు సవాల్‌ విసిరే విభిన్నమైన పాత్రలెన్నో వస్తున్నాయి. ఈ ప్రయాణం ఇలా కొనసాగితే చాలు. దర్శకత్వం, నిర్మాణం జోలికి వెళ్లే ఆలోచన అసలు లేదు.

ప్రస్తుతం చేస్తున్న కొత్త సినిమాలేంటి?

అజయ్‌: చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలో ఓ విభిన్నమైన పాత్రలో నటిస్తున్నా. అల్లు అర్జున్‌ ‘పుష్ప’ చిత్ర విషయమై చర్చలు జరిగాయి. సుధీర్‌ వర్మ నిర్మాణంలో ‘ఆహా’ ఓటీటీ కోసం ఓ వెబ్‌సిరీస్‌లో చేస్తున్నా. చందు మొండేటి దర్శకత్వంలో మరో వెబ్‌సిరీస్‌ చేస్తున్నా.

మా పిల్లల కంప్లైంట్‌ అదే..

‘‘ఈ సినీ ప్రయాణంలో నా తల్లిదండ్రులు, భార్య శ్వేత ప్రోత్సాహం ఎంతో ఉంది. మాది ప్రేమ వివాహం. మాకిద్దరు అబ్బాయిలు. పిల్లలు నా సినిమాలు చూసినప్పుడల్లా.. ‘ఏంటి డాడీ ఎప్పుడూ దెబ్బలు తింటుంటావు?’ అని అడుగుతుంటారు. ముఖ్యంగా మా చిన్నోడు ఈ విషయంపై బాగా కంప్లైంట్‌ చేస్తుంటాడు. ‘దెబ్బలు తింటేనే మనకు డబ్బులొస్తాయ’ని వాళ్లకు సరదాగా బదులిస్తుంటా (నవ్వుతూ)’’.

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని