
తాజా వార్తలు
నా పాత్రని చూసుకుని నేనే భయపడ్డా
‘‘నటన.. దర్శకత్వం ఈ రెండూ నాకు రెండు కళ్లు’’ అంటున్నారు సముద్రఖని. తమిళంతోపాటు తెలుగులోనూ దర్శకుడిగా నిరూపించుకున్న ఆయన, ప్రస్తుతం నటుడిగానూ రెండు భాషల్లో సత్తాని చాటుతున్నారు. గతేడాది ‘అల... వైకుంఠపురములో’ చిత్రంతో అలరించిన ఆయన, ఈసారి సంక్రాంతికి ‘క్రాక్’తో కఠారి కృష్ణగా సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా సముద్రఖని మంగళవారం విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
‘‘సంక్రాంతి పండగకి వరుసగా రెండుసార్లు నేను నటించిన సినిమాలు వచ్చాయి. అదంతా దేవుడి దయ. ‘క్రాక్’ సినిమాని నేను చెన్నైలో చూశా. అక్కడా ఇదే స్పందనే. నేను చేసిన కఠారి కృష్ణ పాత్రని చూసుకుని నేనే భయపడ్డా. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ పాత్ర గురించి, కథ గురించి చెప్పారు. ఇలా వస్తుందని మాత్రం తెలియదు. ఆయన చెప్పినట్టు చేశా. నాలోనూ దర్శకుడు ఉన్నా... సినిమా చేసేటప్పుడు తనని ఇంటి దగ్గరే పెట్టేసి వస్తా. రవితేజ అన్నతో దర్శకుడిగా ‘శంభో శివ శంభో’ చేశా. ఆయన సెట్లో అందించే ప్రోత్సాహం చాలా బాగుంటుంది.’’
‘‘దర్శకుడినే అయినా... నటించడం కోసమే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టా. 1987లో నిక్కరు వేసుకుని చెన్నైకి వచ్చా. వారం రోజులు చిత్ర పరిశ్రమలో ప్రయత్నాలు చేసి వెళ్లిపోయా. ఆ తర్వాత ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి మళ్లీ 1992లో వచ్చా. నటుడిగా మంచి ఆల్బమ్ తయారు చేసుకుని, నా గురించి నేను రాసుకుని ఆఫీసులన్నీ తిరిగా. దర్శకుడు సుందర్ నా చేతిరాత చూసి...నటన కాదు కానీ, రాయడానికి నాకు ఒకరు కావాలి, సహాయ దర్శకుడిగా వస్తావా అని అడిగారు. రాత్రంతా ఆలోచించి... నాకు మళ్లీ నటించాలనే ఆలోచనే రాకూడదని ఆల్బమ్, ఫొటోలు ముక్కలు ముక్కలుగా చించేసి సహాయ దర్శకుడిగా చేరా. ఆ తర్వాత కె.బాలచందర్ దగ్గర పలు చిత్రాలకి, ధారావాహికలకి పనిచేశా. ఆ తర్వాత దర్శకుడయ్యా. రెండు సినిమాలు చేశాక, రెండో సినిమా పరాజయాన్ని చవిచూడటంతో ‘పరుత్తివీరన్’ సినిమాకి అమీర్ దగ్గర సహ దర్శకుడిగా పనిచేశా. ఆ సినిమా తర్వాత మళ్లీ బుల్లితెరతో బిజీ అయిపోయా. చాలా బిజీగా ఉన్న ఆ సమయంలో దర్శకుడు శశికుమార్ వచ్చి ‘మీరు నటుడు కావాలనే పరిశ్రమలోకి వచ్చారు కదా, నా సినిమాలో నటించాలి’ అన్నారు. అందులో నటించా. అది చేస్తున్నప్పుడే ‘నాడోడిగల్’ కథని శశికుమార్‌కి చెప్పా. అదే తెలుగులో ‘శంభో శివ శంభో’గా తెరకెక్కించా’’.
‘‘త్రివిక్రమ్ అన్న నాకు స్నేహితుడు, నా గురువు. ఆయన సినిమా ‘అల...’లో అవకాశమైనా, రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’లో అవకాశమైనా వీటి వెనక చాలా యేళ్ల కథ ఉంది. అనుకోకుండా ఒక రోజు త్రివిక్రమ్ అన్న ఫోన్ చేసి ‘మిమ్మల్ని ‘సుబ్రమణ్యపురం’ నుంచి చూస్తున్నా. మా సినిమాలో చిన్న పాత్రే కానీ, చాలా శక్తివంతమైనది. చేయాలి’ అన్నారు. ‘నాడోడిగల్’ చూశాక రాజమౌళి ఫోన్ చేశారు. ‘బాహుబలి’ తర్వాత ఆయన ఫోన్ చేసి ‘ఆర్.ఆర్.ఆర్’ గురించి చెప్పారు. ప్రస్తుతం తెలుగులో ‘ఆకాశవాణి’ చేస్తున్నా. ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్‌లోనూ నటిస్తున్నా’’.
‘‘నటుడిగా బిజీ అయినా, దర్శకత్వానికి దూరం కాలేదు. కొన్ని కథలు సిద్ధం చేసుకున్నా. ఈ యేడాది చివర్లో తెలుగు, తమిళంలో ఓ ద్విభాషా చిత్రం చేయబోతున్నా. సామాజికాంశాలతో కథలు రాసుకోవడం నాకు అలవాటు. విద్యావ్యవస్థపై ఓ కథ సిద్ధం చేశా.