
తాజా వార్తలు
ఈ దశాబ్దం భారత్‌కు చాలా కీలకం: మోదీ
దిల్లీ: కరోనా మహమ్మారి అంతం తర్వాత ప్రపంచం కొత్త రూపు సంతరించుకోబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇందులో భారత్ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని తెలిపారు. శనివారం సాయంత్రం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అధికారపక్షం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం.
2021తో ప్రారంభమైన దశకం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన దశాబ్దం వలే చాలా కీలకమైందని మోదీ గుర్తుచేశారు. అప్పట్లో ప్రేక్షక పాత్ర వహించిన భారత్.. ఇప్పుడు మాత్రం అలా ఉండబోదని వ్యాఖ్యానించారు. భారతీయ సంస్కృతీ-సంప్రదాయాలు, వసుదైక కుటుంబం వంటి విలువలను ఆధారంగా.. అన్ని అవకాశాల్ని సద్వినియోగం చేసుకొని ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని గత వారం ఓ సందర్భంలో మోదీ తెలిపిన విషయం తెలిసిందే. అలాగే కరోనా కట్టడిలోనూ ప్రపంచదేశాలతో పోలిస్తే మెరుగ్గా వ్యవహరించామని తెలిపారు. కరోనా తెచ్చిన సవాళ్లను అవకాశాలుగా మలచుకోవాలని పిలుపునిచ్చిన ప్రధాని.. భారత్‌ను ఉత్పాదక రంగానికి కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో భారత్ పాత్రపై ప్రధాని ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి...
వంద మంది పంజాబ్ రైతుల అదృశ్యం