
తాజా వార్తలు
రైతు ఉద్యమం నుంచి రెండు సంఘాలు వెనక్కి!
ఆర్కేఎంఎస్, బీకేయూ (భాను) సంఘాల ప్రకటన
దిల్లీ: దేశ రాజధానిలో నిన్న చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలతో రైతు ఉద్యమంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఆందోళనల నుంచి వైదొలుగుతున్నట్టు రెండు రైతు సంఘాలు ప్రకటించాయి. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా చేపడుతున్న ఆందోళనల నుంచి తప్పుకొంటున్నట్టు రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన్ (ఆర్కేఎంఎస్) కన్వీనర్ సర్దార్ వీఎం సింగ్ ప్రకటించారు. అలాగే, భారతీయ కిసాన్ యూనియన్ (భాను) కూడా ఇదే తరహా ప్రకటన చేసింది. ఈ సందర్భంగా వీఎం సింగ్ మాట్లాడుతూ.. నిన్న దిల్లీలో జరిగిన ఘటనలు బాధించాయని పేర్కొన్నారు. ఇతరుల ఆధ్వర్యంలో నిరసన కొనసాగించలేమన్నారు. కొన్ని రైతు సంఘాలు ఇతరులు చెప్పినట్టు పనిచేస్తున్నాయని వీఎం సింగ్ ఆరోపించారు. నిన్నటి ఘటనలు తమను తీవ్రంగా బాధించాయని పేర్కొన్నారు. రాకేశ్ తికాయత్ వంటి నేతల వైఖరితోనే ఉద్రిక్తత నెలకొందన్నారు. నిర్ణీత సమయం కంటే ముందే ర్యాలీ నిర్వహించడం వల్లే ఉద్రిక్తతలు తలెత్తిన్నట్టు చెప్పారు. ర్యాలీని ఇతర మార్గాల్లో ఎందుకు తీసుకెళ్లారని ఆయన ప్రశ్నించారు.
ఎర్రకోటపై జెండా ఎగురవేసి ఏం సాధించాం: వీఎం సింగ్
ఎర్రకోటపై జెండా ఎగురవేసి ఏం సాధించామని ప్రశ్నించారు. ఎర్రకోటపై ఎగిరే త్రివర్ణ పతాకం మన పూర్వీకుల త్యాగఫలమని వ్యాఖ్యానించారు. నిన్న జరిగిన ఘటనల వల్లే ఉద్యమం నుంచి తప్పుకొంటున్నట్టు వీఎం సింగ్ స్పష్టంచేశారు. రైతులు దెబ్బలు తినడానికో.. చనిపోవడానికో ఇక్కడికి రాలేదని, హక్కులు సాధించుకొనేందుకే వచ్చామన్నారు. రైతు హక్కుల కోసం, మద్దతు ధర సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు.
మరోవైపు, తాము కూడా ఆందోళనల నుంచి వైదొలుగుతున్నట్టు బీకేయూ (భాను) అధ్యక్షుడు భాను ప్రతాప్ సింగ్ ప్రకటించారు. నిన్నటి ట్రాక్టర్ల పరేడ్లో చోటుచేసుకున్న ఘటనలు తీవ్రంగా బాధించాయన్నారు. 58 రోజులుగా చిల్లా వద్ద బీకేయూలోని భాను వర్గం ఆందోళనలు కొనసాగిస్తోంది.
ఇవీ చదవండి..
ట్రాక్టర్ల ర్యాలీ: పోలీసుల అదుపులో 200మంది
ఎర్రకోట ఘటనపై హోంశాఖ సీరియస్!
అట్టుడికిన హస్తిన: ఎర్రకోటపై రైతు జెండా