
తాజా వార్తలు
వార్డు వాలంటీర్లు మొబైల్ ఫోన్లు అప్పగించాలి
హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశం
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వార్డు వాలంటీర్ల మొబైల్ ఫోన్ల అప్పగింతపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) హైకోర్టు డివిజన్ బెంచ్ ఎదుట అప్పీల్‌కు వెళ్లింది. ఎస్ఈసీ పిటిషన్‌పై డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. వాలంటీర్ల మొబైల్ ఫోన్లు మున్సిపల్ ఎన్నికల అధికారులకు అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రక్రియ నుంచి వార్డు వాలంటీర్లను పూర్తి దూరంగా ఉంచాలని ఎస్ఈసీ గతంలో ఆదేశాలు ఇచ్చింది. పథకాల పేరుతో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయకూడదని.. లబ్ధిదారుల డేటా దృష్ట్యా వాలంటీర్ల ఫోన్లను నియంత్రించాలని స్పష్టం చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. మొబైల్ ఫోన్లు అప్పగించాల్సిన అవసరం లేదంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై ఎస్ఈసీ హైకోర్టు డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లింది. ఈ నేపథ్యంలో వార్డు వాలంటీర్లు మొబైల్ ఫోన్లను మున్సిపల్ అధికారులకు అప్పగించాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది.