
తాజా వార్తలు
దేవుడితో చెలగాటమాడితే అంతే: జగన్
అమరావతి: దేవుడితో చెలగాటమాడితే తప్పకుండా శిక్షిస్తాడని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. విగ్రహాల విధ్వంసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏపీలో ఇటీవల చోటు చేసుకున్న విగ్రహాల ధ్వంసం, ఆలయాలపై దాడుల ఘటనల నేపథ్యంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. వివిధ అంశాలపై సీఎంఓ అధికారులతో ఇవాళ సమీక్షించిన జగన్.. అర్హత ఉండి ఇంటిపట్టా రాలేదనే మాట వినిపించకూడదన్నారు. అనర్హుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
విపత్తు తక్షణ స్పందన దళం వాహనాల ప్రారంభం..
విపత్తు తక్షణ స్పందన దళం వాహనాలను సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి దూరదృశ్యమాధ్యమం ద్వారా జెండా ఊపి వాహనాలను ప్రారంభించిన సీఎం అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఈ వాహనాలు ఎంతో తోడ్పడతాయన్నారు. రాష్ట పోలీసు యంత్రాంగాన్ని మరింత బల పరిచేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు.
విపత్తులను ఎదుర్కొనేందుకు అవసరమైన సామగ్రి ఈ వాహనాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. 14 తక్షణ స్పందన దళం వాహనాలతో పాటు మరో 36 ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలనూ పోలీసుశాఖకు అప్పగిస్తున్నామని సీఎం వివరించారు. ఘటనా స్థలంలో ఏం జరుగుతుందో నేరుగా కంట్రోల్ రూం నుంచి చూసే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఇదీ చదవండి..
రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహ శకలం లభ్యం
ఆలయాలపై దాడులు.. సీఎం స్పందించరా?