
తాజా వార్తలు
రేషన్ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటింటికీ నిత్యావసరాల పంపిణీకి ఉద్దేశించిన రేషన్ మొబైల్ వాహనాలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2,500 వాహనాలకు విజయవాడలోని బెంజి సర్కిల్లో సీఎం జెండా ఊపారు. వీటితోపాటు మళ్లీ, మళ్లీ ఉపయోగించుకునేందుకు వీలున్న సంచులను కార్డుదారులకు ఉచితంగా అందజేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,260 వాహనాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్, ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. రూ.539 కోట్ల వ్యయంతో వీటిని కొనుగోలు చేశారు. ఒక్కో వాహనం విలువ రూ.5,81,000 ఉండగా.. రాయితీగా వివిధ కార్పొరేషన్ల నుంచి రూ.3,48,600 చొప్పున అందిస్తుండగా లబ్ధిదారుడు రూ.58,119 చెల్లించాలి. మిగిలిన రూ.1,74,357ను లబ్ధిదారు పేరిట బ్యాంకు నుంచి రుణం మంజూరు చేస్తున్నారు. ఈ వాహనాలను వాడుకున్నందుకు పౌర సరఫరాల సంస్థ ప్రతి నెలా అద్దె చెల్లిస్తుంది.
‘మొబైల్ వాహనం ద్వారా రోజుకు 90 కార్డులకు తగ్గకుండా 18 రోజులపాటు కార్డుదారులకు పంపిణీ చేయాలి. అందులో ఉండే ఎలక్ట్రానిక్ తూకం ద్వారా కచ్చితత్వంతో సరకులు ఇవ్వాలి. ప్రతి బియ్యం సంచికి యూనిక్ కోడ్, సీలు వేయడంతోపాటు ఆన్లైన్ ట్రాకింగ్, జీపీఎస్ అమర్చుతారు. వీటి ద్వారా పంపిణీ వివరాలు రియల్ టైమ్లో తెలుసుకోవచ్చు. వాలంటీర్ల ద్వారా కార్డుదారుల బయోమెట్రిక్ పరికరాల్లో ఇళ్లవద్దే వేలిముద్రలు తీసుకుని నిత్యావసరాలను ఇస్తాం’ అని పౌర సరఫరాలశాఖ వివరించింది. ‘2020 జూన్ నుంచి ఇప్పటి వరకు కొత్తగా 4.93 లక్షల బియ్యం కార్డులు అందించాం. 17.08 లక్షల కార్డుల్లో సభ్యుల పేర్లను చేర్చాం. 4.38 లక్షల కార్డుల్ని విభజించాం’ అని ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇవీ చదవండి..
ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు