ఏపీలో పూర్తి స్థాయి తరగతులు: మంత్రి సురేశ్‌
close

తాజా వార్తలు

Published : 27/03/2021 13:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో పూర్తి స్థాయి తరగతులు: మంత్రి సురేశ్‌

అమరావతి: రాష్ట్రంలో కొవిడ్‌ స్థితిగతులపై విద్యాశాఖ అధికారులతో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ శనివారం వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రణాళికతో చర్యలు తీసుకోవడంతో అకడమిక్‌ క్యాలెండర్‌ గాడిలో పెట్టాం. కొవిడ్‌ కేసులు వచ్చిన విద్యాసంస్థలు వెంటనే మూసేయాలి. పెద్ద ఎత్తున సంక్షోభం వస్తే కొంత నష్టం తప్పక ఉంటుంది. దేశంలోనే అత్యధిక కరోనా టెస్టులు మన రాష్ట్రంలోనే చేశాం. కొవిడ్‌ మళ్లీ పుంజుకుంటోంది. రెండు నెలలు జాగ్రత్త అవసరం. రాజమహేంద్రవరంలోని ప్రైవేటు కళాశాలలో 168 మందికి కరోనా సోకింది. కరోనా సోకినవారిని ప్రాథమికంగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి. పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవు. విద్యార్థులకు కరోనా పరీక్షలు ఇంకా పెంచుతాం. ఆదివారాలు కూడా ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తాం’’ అని విద్యాశాఖ మంత్రి వెల్లడించారు.

వెయ్యికి చేరువలో కేసులు
 ఏపీలో ఒక్క రోజు నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య వెయ్యికి చేరువ అవుతున్నాయి. అయిదు రోజులుగా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. నిన్న 984 మంది కొవిడ్‌-19 బారినపడ్డారు. గడిచిన 4 నెలల్లో రోజువారీ కేసులను పరిశీలిస్తే ఇవే అత్యధికం కావడం గమనార్హం. గతేడాది నవంబరు 24న 1,085 కేసులు నమోదుకాగా.. ఆ తర్వాత అత్యధిక కేసులు ఇవే. ఇప్పటి వరకు  రాష్ట్రంలో 8,93,968మంది వైరస్‌ బారినపడ్డారు. చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒకరి చొప్పున మృతి చెందారు. 306మంది కోలుకున్నారు. గుంటూరులో అత్యధికంగా 176, విశాఖపట్నం 170, చిత్తూరు 163, కృష్ణా 1,10 కేసులు నమోదయ్యాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని