
తాజా వార్తలు
సుప్రీం తీర్పు: ఎస్ఈసీకి ఏపీ ప్రభుత్వ సహకారం
అమరావతి: పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు తీర్పునకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. సోమవారం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పార్టీ ముఖ్య నేతలు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల విషయంలో సుప్రీం కోర్టు తీర్పుపై చర్చించారు. ప్రభుత్వం తరఫు నుంచి పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై సమీక్షించారు. పంచాయతీ ఎన్నికల్లో ఎస్ఈసీకి సహకరించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం: సజ్జల
పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఎవరిపైనా పైచేయి సాధించాలని ఎన్నికల వాయిదా కోరలేదు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేంద్రం సలహా తీసుకుంటాం. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం చివరి వరకూ పోరాడింది. ఎన్నికలు, వ్యాక్సినేషన్ రెండూ ఒకేసారి నిర్వహణ కష్టం. ఎన్నికలు జరిపి తీరాలన్న ఎస్ఈసీ పట్టుదల వెనుక కుయుక్తులు ఉన్నాయి. ఎన్నికలకు వైకాపా ఎప్పుడూ సిద్ధమే. ఎన్నికల నిర్వహణ ద్వారా కరోనా విజృంభించే ప్రమాదం ఉంది. మాకు ఎలాంటి ఇగో సమస్యలు లేవు. ఎస్ఈసీ నిర్ణయం ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. ప్రజల కోసం చేసిన పోరాటంలో పరాజయం కూడా ఆనందమే’’ అని అన్నారు.
ఇవీ చదవండి