
తాజా వార్తలు
హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళతాం: విశ్వరూప్
ఒంగోలు: తమ ప్రభుత్వం భయపడి స్థానిక ఎన్నికల వాయిదా కోరడంలేదని ఏపీ మంత్రి విశ్వరూప్ అన్నారు. గురువారం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై మంత్రి స్పందించారు. హైకోర్టు బెంచ్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. రాజకీయాలు కాదు ప్రజల ఆరోగ్యం ముఖ్య మన్నారు. ‘‘ఎన్నికలు ఎప్పుడైనా సిద్ధమే..కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు అంత అనుకూలమైన వాతావరణం లేదు. కొవిడ్ కారణంగా ప్రజల ఆరోగ్యం ముఖ్యమనే ఉద్దేశంతో ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్నాం. సీఎం జగన్ ఎన్నికలంటే భయపడే వ్యక్తి కాదు. అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిచిన వ్యక్తి ఆయన. రాష్ట్రంలో 51 శాతం ఓట్లతో, 85 శాతం సీట్లతో అధికారంలో ఉన్న మాకు ప్రజల ప్రాణాలే ముఖ్యం’’ అని మంత్రి విశ్వరూప్ అన్నారు.
హైకోర్టు తీర్పు ఆశించినట్టుగా లేదు: ఏపీఎన్జీవో
స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు ఉద్యోగులు ఆశించినట్టుగా లేదని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసి ఉద్యోగుల వాదన వినిపిస్తామన్నారు. ప్రస్తుతం ఉద్యోగుల్లో కరోనా భయం ఎక్కువగా ఉందని.. టీకా పంపిణీ పూర్తైన తర్వాత ఎన్నికలు జరపాల్సిందిగా కోరినా కోర్టు పరిగణనలోకి తీసుకోకపోవడం శోచనీయన్నారు. రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని ఆ తర్వాత ఉద్యోగులు కూడా ఎన్నికలకు సిద్ధమేనని చెప్పారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ప్రకటించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఉద్యోగులపై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఏముందన్నారు. మరో రెండు నెలల పాటు వాయిదా వేస్తే ఏమవుతుందని ప్రశ్నించారు.
ఇవీ చదవండి..
ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
తిరుపతిలో తెదేపా ధర్మపరిరక్షణ యాత్ర ఉద్రిక్తం