close
Array ( ) 1

తాజా వార్తలు

కలే.. వాస్తవ‘మాయే’!

వర్చువల్‌ రియాలిటీ

కల్పనగా వాస్తవం. వాస్తవంగా కల్పన. అవును.. కాల్పనిక వాస్తవికత- వర్చువల్‌ రియాలిటీ మన కళ్ల ముందు ఇలాంటి మాయే చేస్తుంది.  కలయో, వైష్ణవ మాయో అనిపిస్తూ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతుంది. ఒకప్పుడు కాల్పనిక వాస్తవికత అంటే సైన్స్‌ ఫిక్షన్‌. అది వాస్తవరూపం  ధరించటమే కాదు.. అన్ని రంగాలనూ శరవేగంగా చుట్టబెడుతోంది. వీడియో గేమ్స్‌తో వినోదాన్ని పంచటంతో మొదలై.. విద్య, ఇంజినీరింగ్‌,  స్థిరాస్తి, చిల్లర వర్తకం, వీడియో నిర్మాణం వంటి వాటిని దాటుకొని.. ఆరోగ్యరంగానికీ విస్తరించింది. రకరకాల సమస్యల చికిత్సకు చేయూతనూ అందిస్తోంది! 


సాంకేతిక పరిజ్ఞానానికి బాధలేం తెలుసు? భయాలేం తెలుసు? ఎదుటివాళ్ల బాగోగులు అర్థమవుతాయా ఏం? వైద్యరంగంలో వర్చువల్‌ రియాలిటీ (ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ) అనగానే మెదిలే అనుమానాలెన్నో. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ కాల్పనిక వాస్తవికత కొత్త పుంతలు తొక్కుతోంది. వైద్య విద్యార్థులకు సానుభూతిని బోధిస్తోంది. నొప్పులు తగ్గటానికి, భయాలను పోగొట్టటానికి.. చివరికి అంతిమ ఘడియల్లో ఆఖరి కోరికలను తీర్చుకోవటానికీ ఉపయోగపడుతోంది. నిజానికి కాల్పనిక వాస్తవికత 1965లోనే వైద్యరంగంలో అడుగిడింది. ఎముకల సమస్యకు సరైన చికిత్సను నిర్ణయించటానికి రాబర్ట్‌ మాన్‌ కాల్పనిక వ్యవస్థను పరిచయం చేశారు. ఎముకల వైద్య విద్యార్థులకు శిక్షణ ఇవ్వటానికీ దీన్ని ఉపయోగించారు. అక్కడ్నుంచి వెనుదిరిగి చూసింది లేదు. సంక్లిష్టమైన శరీర భాగాల నిర్మాణాన్ని 3డీ, 4డీల్లో కళ్ల ముందు ఆవిష్కరిస్తూ  సరికొత్త బోధనా రీతులకు శ్రీకారం చుట్టింది. మెదడు శస్త్రచికిత్స దగ్గర్నుంచి రక్తనాళాలను అతికించటం వరకూ అన్ని విద్యలనూ సులభంగా నేర్చుకోవచ్చని నిరూపించింది. స్మార్ట్‌ఫోన్‌, వీఆర్‌ హెడ్‌సెట్‌ ఉంటే చాలు. ఎన్నెన్నో సమస్యలకు చికిత్స చేయొచ్చనే ఆశలనూ రేకెత్తిస్తోంది.

కదలికలు మెరుగు

మెదడుకు దెబ్బ తగలటం, పక్షవాతం, పార్కిన్సన్స్‌ వంటి జబ్బుల్లో శరీర కదలికలు అస్తవ్యస్తమవుతుంటాయి. వీటిని పునరుద్ధరించటానికి వ్యాయామాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందుకోసమే స్విట్జర్లాండ్‌ కంపెనీ మైండ్‌మేజ్‌ ఓ వర్చువల్‌ రియాలిటీ పరిజ్ఞానంతో వినూత్న  హెడ్‌సెట్‌ను రూపొందించింది. దీన్ని ధరించగానే ఆయా వ్యక్తుల ప్రతిరూపాలు 3డీ ఆకారాల్లో  కనబడతాయి. ఆరోగ్యంగా ఉన్న భాగాలను  కదిలించినప్పుడు ప్రతిరూపంలో పక్షవాతానికి గురైన భాగాలూ కదులుతాయి. ఉదాహరణకు- ఎడమ చేయి చచ్చుబడింది. కుడిచేయి బాగానే ఉందనుకుందాం. కుడిచేయిని కదిల్చినప్పుడు ప్రతిరూపం ఎడమ చేయి కదులుతుంది. ఇది ఎడమ చేయి కదలికలకు తోడ్పడే మెదడులోని భాగాలు ప్రేరేపితం కావటానికి దోహదం చేస్తుంది. ఇలా క్రమంగా కదలికలు మెరుగు పడటానికి వీలు కల్పిస్తుంది. ఇలాంటి ప్రేరేపణలను వినోదాత్మకంగా మార్చటం మీదా పరిశోధకులు దృష్టి సారించారు. కాల్పనిక ఆకాశం నుంచి నాణేలు కిందపడి పోవటం లాంటి ఆటలనూ సృష్టిస్తున్నారు. ఆ నాణేలను పట్టుకోవటానికి అప్రయత్నంగానే ముందుకు కదిలేలా చేయటం వీటి ఉద్దేశం.

సానుభూతి బోధన

నుకోకుండా క్యాన్సర్‌ బయటపడింది. లేదూ ఎవరో హఠాత్తుగా చనిపోయారు. రోగికి గానీ బంధువులకు గానీ ఇలాంటి విషయాలను చెప్పటం డాక్టర్లకు ఎప్పుడైనా సవాలే. ఎదుటివారు ఉన్నట్టుండి బాధలో కూరుకుపోకుండా, నెమ్మదిగా వివరించటానికి ఎంతో మనో నిబ్బరం కావాలి. సానుభూతి చూపాలి. ఇవి అనుభవం మీద గానీ అబ్బేవి కావు. వీటిని అలవరచుకోవటానికి మెడికల్‌ సైబర్‌వరల్డ్స్‌ ఇంక్‌ పరిశోధకులు ఎంపథిక్‌-వీఆర్‌ పరిజ్ఞానాన్ని రూపొందించారు. అచ్చం మనలాగే భావోద్వేగాలతో స్పందించే మానవ ప్రతిరూపాలతో మాట్లాడుతూ.. నొప్పించని విధంగా విషయాన్ని వివరించటం ఇందులోని ప్రత్యేకత. ఇలా ఇది వాస్తవ పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలో నేర్పిస్తుందన్నమాట.

టీకా నొప్పి తెలియనివ్వకుండా..

టీకాలంటే పిల్లలకు చాలా భయం. సిరంజీని చూడగానే హడలెత్తిపోతుంటారు. మరి వీరిని సముదాయించి, నొప్పి తెలియని విధంగా టీకా  ఇవ్వాలంటే? హెర్మిస్‌ పార్‌డిని ల్యాబోరేటరీ ఆధ్వర్యంలో రూపొందిన వీఆర్‌ వ్యాక్సిన్‌ దీనికి చక్కటి పరిష్కారం చూపుతుంది. పిల్లలు తమ తలకు వీఆర్‌ హెడ్‌సెట్‌ను తగిలించుకోగానే అందమైన రాజ్యాన్ని కాపాడే కార్టూన్‌లో ఓ రాకుమారి ప్రత్యక్షమవుతుంది. అక్కడ ‘తమ’ కదిలే చేతికి ఆమె మహిమ గల పట్టీని చుడుతుంది. దీంతో రాజ్యాన్ని కబళించాలని చూసే రాక్షసుడు భగ్గున మండిపోతాడు. సరిగ్గా అప్పుడే డాక్టర్‌ టీకా ఇచ్చేస్తాడు. టీకా భయం, నొప్పి హుష్‌ కాకి అవుతాయి.

భయానికి కళ్లెం

కొందరికి సాలీడు, బల్లులంటే తెగ భయం. కొందరు బొద్దింక కనబడితే చాలు.. వణికిపోతారు. కొందరికి ఎత్తులు ఎక్కాలంటే భయం. ఇలాంటి  భయాలు, ఆందోళనలకూ కాల్పనిక వాస్తవికత పరిష్కారం చూపుతోంది. భయం, ఆందోళన కలిగించే ప్రాంతాలను, పరిస్థితులను కృత్రిమంగా సృష్టించి.. వాటిల్లో తిరుగాడేలా చేసి.. భయాలను పోగొట్టటం దీని ప్రత్యేకత. స్పెయిన్‌, అమెరికా సంయుక్త కంపెనీ సీయస్‌ ఇలాంటి వీఆర్‌ పరిజ్ఞానాన్నే రూపొందించింది. వర్చువల్‌ బెటర్‌ అనే కంపెనీ సైతం తీవ్రమైన ప్రమాదాలు, బాధాకరమైన ఘటనల అనంతరం తలెత్తే ఒత్తిడి సమస్యలను తగ్గించటానికి ప్రత్యేక పరిజ్ఞానాన్ని తయారుచేసింది. గాయాలు, బాధల నుంచి కోలుకోవటానికి సైనికులకు తోడ్పడేందుకు సదరన్‌  కాలిఫోర్నియా యూనివర్సిటీ బ్రేవ్‌మైండ్‌ అనే పరిజ్ఞానాన్నీ తీసుకొచ్చింది. వీటన్నింటి లక్ష్యం ఒక్కటే. వాస్తవ పరిస్థితుల కల్పనలతో నిజమైన భయాలను పోగొట్టటమే.

కాన్పు తేలిక, నొప్పి దూరం

కాన్పు అంటేనే పునర్జన్మ. ఆ నొప్పులను భరించటం అంత తేలిక కాదు. వీటిని తెలియనీయకుండా చేయగలిగితే? ఇందుకోసం మందులు,  మత్తుమందులు లేక కాదు. వీటితో అవసరం లేకుండా వీనులకు, కనులకు విందు చేసే శబ్దాలు, దృశ్యాలతో కనికట్టు చేయటం మీదా పరిశోధకులు దృష్టి సారించారు. ఈ దిశగా కాల్పనిక వాస్తవికత పరిజ్ఞానాన్ని కొత్త పుంతలు తొక్కించారు. ఆ మధ్య ఎరిన్‌ బ్రాటన్‌ మార్టుకి అనే  ఆవిడ కాల్పనిక వాస్తవిక పరిజ్ఞానంతో పురుడు పోసుకొని చరిత్ర సృష్టించారు. కాన్పు కావటానికి రెండు గంటల ముందు నుంచే వీఆర్‌ హెడ్‌సెట్‌ను ధరించి.. సముద్ర తీరాల దృశ్యాలు, మనసుకు హాయినిచ్చే మాటల్లో మునిగిపోయారు. ఇలా ఆమె కాన్పు నొప్పులు తెలియకుండా సంతానాన్ని కనేశారు. దీర్ఘకాల నొప్పులతో బాధపడేవారికీ వీఆర్‌ పరిజ్ఞానం ఎంతో ఉపశమనం కలిగిస్తోంది. లాస్‌ ఏంజెలిస్‌లోని సెడార్స్‌-సినాయ్‌  హాస్పిటల్స్‌ పరిశోధకులు రూపొందించిన బేర్‌ బ్లాస్ట్‌ పరిజ్ఞానమే దీనికి నిదర్శనం. ఇది నొప్పి భావనను 25% వరకూ తగ్గిస్తుండటం విశేషం.

ఆఖరి కోరికలూ తీరుస్తుంది

జీవితంలో ఎన్నెన్నో కోరికలు. అన్నీ తీరాలని లేదు. మరణానికి చేరువైన సమయంలో వీటిని తలచుకొని బాధపడుతూ ఉంటారు కూడా.  నయం కాని జబ్బుల బారినపడి.. సాంత్వన చికిత్స (పాలియేటివ్‌ కేర్‌) తీసుకుంటూ.. మరణానికి దగ్గరలో ఉన్నామని తెలిసినవారి గురించి  చెప్పాల్సిన పనేలేదు. ఇలాంటి వారికి ఊరట కలిగించేందుకు టొరంటోకు చెందిన డేవిడ్‌ పార్కర్‌ అనే ఐటీ నిపుణుడు ఓ వర్చువల్‌ రియాలిటీ  వ్యవస్థను రూపొందించారు. దీన్ని ధరిస్తే నచ్చిన చోటుకు వెళ్లి విహరించొచ్చు. ఆఫ్రికా అడవుల అందాలనైనా, ధ్రువాల వద్ద కాంతులనైనా..  దేన్నయినా వీక్షించొచ్చు. కాల్పనిక అవతారం ధరించి స్కూబా డైవింగ్‌ సైతం చేయొచ్చు. టొరంటోలోని బ్రిడ్జిపాయింట్‌ హెల్త్‌ అండ్‌ మౌంట్‌  సినాయ్‌ హాస్పిటల్‌లో సాంత్వన చికిత్స తీసుకున్న ఎంతోమంది ఇప్పటికే దీంతో ఊరట పొందారు.

ఇలాంటి టెక్నాలజీ సంగతులు మీరూ పంచుకోండి. ప్రచురిస్తాం. 
ఈ-మెయిల్‌ ఐడీ: 
its@eenadu.in


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.