
తాజా వార్తలు
నిరసన తర్వాతే ప్రభుత్వం స్పందించింది
తెదేపా శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు
అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలిపాకే పంటల బీమా ప్రీమియం చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు అన్నారు. అసెంబ్లీ వద్ద మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పంటల బీమా కట్టలేదని ప్రభుత్వాన్ని తాము నిలదీస్తే కట్టామంటూ సభలో ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ మంత్రి అసత్యాలు చెప్పారని దుయ్యబట్టారు. ఇప్పుడు బీమా ప్రీమియం చెల్లింపులకు నిధులు విడుదల చేస్తే లాభం ఏమిటని ప్రశ్నించారు.
పంట నష్టపోయాక, రైతులు చనిపోయాక పరిహారం చెల్లిస్తే లాభమేమిటని ప్రభుత్వాన్ని అచ్చెన్నాయుడు నిలదీశారు. ప్రభుత్వం ఏవిధంగా రైతుల్ని మోసం చేసిందో ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు. చంద్రబాబుని ఉద్దేశించి వైకాపా మంత్రులు ఏకవచనంతో మాట్లాడటం సబబేనా అని మండిపడ్డారు. ఈ తరహా అవాకులు చవాకులు మానుకోకుంటే జగన్ను ఉద్దేశించి ప్రతి తెదేపా కార్యకర్త గట్టిగా స్పందించాల్సి వస్తుందని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.