
తాజా వార్తలు
ఎన్నికల్లో పోటీ చేస్తే..టీకొట్టు తొలగించారు
తిరుపతి: ఏపీలో మున్సిపల్ ఎన్నికలు పట్టణాల్లో కొన్నిచోట్ల రాజకీయ పార్టీల మధ్య చిచ్చు రేపుతున్నాయి. మరికొన్ని చోట్ల ఉద్రిక్తతలకు, అల్లర్లకు దారి తీస్తున్నాయి. తాజాగా.. తిరుపతిలోని పీజీఆర్ ధియేటర్ పక్కన ఉన్న టీ దుకాణంపై నగర పాలక సంస్థ సిబ్బంది దాడులు నిర్వహించారు. దుకాణం అక్రమ నిర్మాణమన్న అధికారులు.. దాన్ని కూల్చివేస్తామని దుకాణంలోని సామగ్రిని రోడ్డుపై పడేశారు. జేసీబీతో దుకాణం కూల్చివేసేందుకు యత్నించారు. ధియేటర్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకే ఖాళీ చేయిస్తున్నామని అధికారులు చెప్పారు. అయితే తాము ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ధియేటర్ నిర్వాహకులు అధికారులు తీరును ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న దుకాణం నిర్వాహకుడు ఆర్పీ శ్రీనివాస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో 43వ డివిజన్ తెలుగుదేశం కార్పొరేటర్ అభ్యర్థిగా తన భార్య లక్ష్మిదేవి నామినేషన్ వేసిందని చెప్పారు. నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని కొన్ని రోజులుగా తనపై కొందరు ఒత్తిడి తెచ్చారన్నారు. ఒత్తిడికి తలొగ్గకపోవడంతోనే ఇలా జీవనాధారమైన దుకాణాన్ని కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కూల్చివేతకు సంబంధించిన పత్రాలు కూడా అధికారులు వద్ద లేవన్న బాధితుడు వాపోయారు. బెదిరింపు ప్రక్రియలో భాగంగానే ఇలాంటి దాడులు చేస్తున్నారని ఆరోపించారు. బాధితుడికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని స్థానిక తెదేపా నేత నర్సింహయాదవ్ భరోసానిచ్చారు.