గోవిందరాజస్వామి ఆలయంలో చోరీకి యత్నం
close

తాజా వార్తలు

Updated : 27/03/2021 14:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గోవిందరాజస్వామి ఆలయంలో చోరీకి యత్నం


తిరుపతి: తిరుపతిలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన గోవిందరాజస్వామి ఆలయంలో చోరీకి యత్నించిన ఘటన కలకలం రేపింది. నిన్న రాత్రి 9గంటలకు ఆలయం మూసివేసే సమయంలో సిబ్బందికి కనిపించకుండా ఓ వ్యక్తి లోపలే ఉండిపోయాడు. అర్ధరాత్రి ఆ వ్యక్తి ఆలయంలోని రెండు హుండీల్లో చోరీకి యత్నించినట్లు అనుమానిస్తున్నారు. గుడిలో అన్ని చోట్లా తాళాలు వేసి ఉండటంతో దొంగ ప్రయత్నం ఫలించలేదు. ఈ రోజు ఉదయం ఆలయం వద్దకు వచ్చిన సిబ్బంది.. ధ్వజ స్తంభం, వినాయకస్వామి  ఉపాలయం వద్ద అనుమానాస్పద వస్తువులు కనిపించాయి. దీంతో అనుమానం వచ్చిన నిఘా సిబ్బంది ఆరా తీయగా.. ఓ వ్యక్తి రాత్రంతా గుడిలోనే ఉన్నట్టు తెలిసింది. దీనిపై తితిదే నిఘా సిబ్బంది తిరుపతి అర్బన్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. 

సీసీఎస్‌ డీఎస్పీ మురళీధర్‌ ఆధ్వర్యంలో సిబ్బంది గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకుని చోరీకి యత్నం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. విష్ణు నివాసం కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో సీసీ టీవీలో దృశ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు. నిందితుడి వద్ద ఉన్న తాళాలతో ధ్వజస్తంభం వద్ద ఉన్న హుండీని తెరిచేందుకు ప్రయత్నించినట్టు సీసీటీవీలో రికార్డయింది. నిందితుడు ఆలయంలోకి ఎలా వచ్చాడు? ఏవైనా వస్తువులు అపహరించాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సీసీఎస్‌ డీఎస్పీ మురళీధర్‌ మాట్లాడుతూ.. సీసీ కెమెరా దృశ్యాల్లో దొంగను గుర్తించినట్లు చెప్పారు. ఆలయంలో ఎలాంటి వస్తువులు చోరీ కాలేదన్నారు. రాత్రంతా వ్యక్తి ఆలయం లోపలే ఉండి.. ధ్వజస్తంభం వద్ద చోరీకి యత్నించినట్లు తెలిపారు. తాళాలు తెరిచేందుకు యత్నించినా సాధ్యపడలేదని వెల్లడించారు. ఉదయం ఆలయం తెరిచిన తర్వాత భక్తులతో కలిసి బయటకు వెళ్లినట్లు భావిస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. దొంగ వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుందని .. పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకుంటామని డీఎస్పీ వెల్లడించారు.

శ్రీవారికి పెద్దన్నయ్యగా పేరు గడించిన గోవిందరాజస్వామి ఆలయంలో 2019 ఫిబ్రవరి 2న ఉత్సవమూర్తులకు ఉన్న విలువైన కిరీటాలు మాయమయ్యాయి.  స్వామివారి 1కేజీ 351 గ్రాముల 3 బంగారు కిరీటాలు చోరీకి గురవ్వడం అప్పట్లో సంచలనం సృష్టించింది. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన నిందితుడ్ని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆలయంలో నిఘా పెంచి భద్రత కట్టుదిట్టం చేశారు. తాజాగా ఓ వ్యక్తి ఆలయంలో చోరీకి యత్నించడం ఆధ్యాత్మిక నగరంలో కలకలం రేపింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని