
తాజా వార్తలు
భాజపా యత్నాలు ఫలించవు
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్య
దిల్లీ: మహారాష్ట్రలోని తమ ప్రభుత్వాన్ని దించేందుకు భాజపా చేసే ఎలాంటి ప్రయత్నమూ ఫలించదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి సర్కార్ స్థిరంగానే ఉంటుందని, రాష్ట్రంలో పాలన కొనసాగిస్తుందని స్పష్టంచేశారు. అధికార కూటమి నేతలు, వారి కుటుంబ సభ్యులపైకి ఈడీని ప్రయోగించడం ద్వారా భాజపా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు. తమ కూటమి సైద్ధాంతిక విభేదాలతో ప్రభుత్వం పడిపోతుందని భాజపా నేతలు చెప్పారని, ఏడాది పూర్తియినా అలాంటిదేమీ జరగలేదన్నారు. శివసేన ఎంపీ, సామ్నా పత్రిక సంపాదకుడు సంజయ్ రౌత్ సతీమణి వర్షకు ఈడీ నోటీసులు జారీచేయడం అధికార దుర్వినియోగమేనన్నారు. తనకు కూడా నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారని.. కానీ ఆ తర్వాత ఉపసంహరించుకున్నారన్నారు. తాను ఆ బ్యాంకులో సభ్యుడిని కాదన్న పవార్.. .అక్కడ తనకు ఖాతా కూడా లేదన్నారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కలయికగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటై గత నెలలోనే ఏడాది పూర్తయిన విషయం తెలిసిందే.