భాజపా× తృణమూల్‌.. ఆడియో వార్‌!
close

తాజా వార్తలు

Updated : 28/03/2021 13:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భాజపా× తృణమూల్‌.. ఆడియో వార్‌!

ఇంటర్నెట్‌డెస్క్‌: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వా- నేనా అన్నట్లు తలపడుతున్న భాజపా, తృణమూల్‌ కాంగ్రెస్‌ మధ్య సరికొత్త వివాదం రాజుకుంది.  రాష్ట్రంలో తొలి విడత ఎన్నికల పోలింగ్‌ వేళ రెండు పార్టీల మధ్య ఆడియో వార్‌ నెలకొంది. తొలుత మమతపై ఆరోపణలతో భాజపా ఓ ఆడియోను విడుదల చేయగా.. పోటీగా తృణమూల్‌ సైతం మరో ఆడియో టేప్‌ను విడుదల చేయడంతో పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. ఇంకా ఏడు దశల ఎన్నికలు మిగిలి ఉన్న బెంగాల్‌లో ఇలాంటి మరిన్ని అంశాలు తెరపైకి వస్తాయని చెబుతోందీ ఘటన.

వివాదం మొదలైంది ఇలా..

నందిగ్రామ్‌ ఎన్నికల్లో తృణమూల్‌ గెలుపునకు కృషి చేయాలంటూ మమతా బెనర్జీ తనను కోరారని నందిగ్రామ్‌కు చెందిన భాజపా నేత ప్రళయ్‌ పాల్‌ ఓ ఆడియో టేప్‌ను శనివారం విడుదల చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌కు తిరిగి వచ్చేయాలని తనను కోరారని పాల్‌ ఆరోపించారు. అయితే, తాను సువేందు అధికారికి అనుచరుడిగా ఉండటంతో భాజపాతోనే ఉంటానని చెప్పానంటూ సదరు ఆడియోను పాల్‌ మీడియాకు విడుదల చేశారు. ఎన్నికల్లో ఓడిపోతానన్న మమత భయానికిదే  నిదర్శనమంటూ భాజపా విమర్శలు గుప్పించింది.

తృణమూల్‌ రివర్స్‌ అటాక్‌

భాజపా ఆడియో టేప్‌ విడుదల చేసిన కాసేపటికే తృణమూల్‌ మరో ఆడియో టేప్‌తో ముందుకొచ్చింది. అందులో భాజపా సీనియర్‌ నేత ముకుల్‌ రాయ్‌, ఆ పార్టీకి చెందిన మరో నేత శిశిర్‌ బజోరియాతో మాట్లాడుతున్న ఆడియోను విడుదల చేసింది. ఈసీని ఎలా ప్రభావితం చేయాలన్న అంశంపై వారిద్దరూ చర్చించుకున్నారంటూ తృణమూల్‌ ఆరోపించింది. నియోజకవర్గంలో ఎవర్నైనా బూత్‌ ఏజెంట్లుగా నియమించుకోవడానికి ఈసీని సంప్రదించాలని ముకుల్‌ రాయ్‌ అన్నట్లుగా ఆడియో ఉందని, ఫోన్‌ సంభాషణలకు అనుగుణంగానే ఈసీ సైతం నడుచుకుందని ఆరోపించింది. ఏ పార్టీనీ సంప్రదించకుండా భాజపా వినతి మేరకు నిబంధనలను ఆ పార్టీకి అనుకూలంగా ఈసీ మార్చివేసిందని తృణమూల్‌ ఆరోపించింది. మరోవైపు ఈ నిబంధన మార్చివేయాలంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధుల బృందం ఈసీకి మెమొరాండం సమర్పించింది. కేవలం బూత్‌ పరిధిలోని వ్యక్తులను మాత్రమే బూత్‌ ఏజెంట్లుగా నియమించాలని కోరింది.

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలకు 8 దశల్లో ఎన్నికలు జరుగుతుండగా.. ఏప్రిల్‌ ఒకటిన నందిగ్రామ్‌ స్థానానికి పోలింగ్‌ జరగనుంది. ఇక్కడ తృణమూల్‌ తరఫున మమతా బెనర్జీ, భాజపా తరఫున సువేందు అధికారి బరిలో నిలవడంతో ఈ స్థానంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని