పెళ్లి డబ్బులతో కూలీల ఆకలి తీర్చి..
close

తాజా వార్తలు

Published : 19/05/2020 15:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెళ్లి డబ్బులతో కూలీల ఆకలి తీర్చి..

పుణె: కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయాలంటే ఉండాల్సింది నోట్ల కట్టలు కాదని.. పెద్ద మనసని నిరూపించాడు పుణెకు చెందిన ఓ ఆటోడ్రైవర్‌. ఈ కరోనా కాలంలో ఘనంగా పెళ్లెందుకని.. ఆకలితో ఉన్నవారి కడుపు నింపి వారి దీవెనలు పొందాలనుకున్నాడు. అందుకే వివాహం కోసం దాచుకున్న సొమ్ముతో వలస కూలీల ఆకలి తీర్చుతున్నాడు. కాబోయే భార్య కూడా అందుకు అండగా నిలిచి వెన్ను తట్టింది.

అక్షయ్ కొతవాలే(30) మహారాష్ట్రలోని పుణెలో ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. మే 25న అతడి వివాహం జరిపించాలని పెద్దలు నిశ్చయించారు. కానీ ఈలోపే కరోనా కట్టడికోసం కేంద్రం లాక్‌డౌన్‌ విధించింది. ఆ దెబ్బతో పని కోల్పోయి వలస కూలీలు ఎంతో మంది రోడ్డున పడ్డారు. సొంతూళ్లకు వెళ్లలేక.. వీధుల వెంట పట్టెడన్నం కోసం ఆశగా ఎదురుచూడటం అక్షయ్ కంటపడింది. దీంతో అక్షయ్ మనసు ద్రవించింది. వెంటనే మరో ఆలోచన లేకుండా పెళ్లి వాయిదా వేసుకున్నాడు. వివాహం కోసం దాచుకున్న రూ.రెండు లక్షలతో వారి కడుపు నింపాలని నిశ్చయించుకున్నాడు. అందుకు కాబోయే భార్య, స్నేహితుల సహకారమూ అందింది. వారి సాయంతో చపాతీలు, కూర చేసి ఒకపూట కూడా తిండికి నోచుకోని వారి ఆకలిని తీర్చాడు. కానీ, అంతలోనే ఓ సమస్య ఎదురైంది. దాచుకున్న డబ్బు అయిపోవచ్చింది. కనీసం మే 31 వరకైనా తన సాయాన్ని కొనసాగించాలని ముందే అనుకున్నాడు. స్నేహితులతో చర్చించి, చపాతీలకు బదులు సాంబారు అన్నం పంచడం మొదలుపెట్టాడు.

ఈ ఒక్కపనితోనే అక్షయ్‌ ఆగిపోలేదు. ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉన్న వృద్ధులు, గర్భిణులను ఉచితంగా తన ఆటోలో తీసుకెళ్తున్నాడు. అంతేకాకుండా ఆటోకు లౌడ్ స్పీకర్ పెట్టి.. స్నేహితులతో కలిసి కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నాడు. రోడ్డు పక్కన నివసించేవారికి మాస్కులు, శానిటైజర్లను పంచి తన ఉదార స్వభావాన్ని చాటుకుంటున్నాడు.
దీనిపై అతడిని కదలించగా..‘ఆటో నడిపి రూ. రెండు లక్షల వరకు దాచుకున్నా. ఇప్పుడు వాటిని వివాహ వేడుకకు వాడటం కన్నా.. ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి అవసరాలకు ఉపయోగించడమే సరైందని అనిపించింది. నా కాబోయే భార్యతో కలిసి ఓ నిర్ణయం తీసుకొని పెళ్లిని వాయిదా వేసుకున్నా. నేను చేసే పనులకు నా స్నేహితుల సహకారం కూడా ఉంది’ అని అక్షయ్ వెల్లడించాడు.

ఇవీ చదవండి:

స్మార్ట్ మాస్క్‌తో కరోనాకి చెక్‌..


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని