
తాజా వార్తలు
‘తెరాస ప్రభుత్వ వైఖరి వల్లే ఐటీఐఆర్ రాలేదు’
ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్కు బండి సంజయ్ బహిరంగ లేఖ
హైదరాబాద్: తెలంగాణలో ఐటీఐఆర్ ప్రాజెక్టు అమలు కాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ వైఖరి వల్లే ప్రాజెక్టు రాలేదని కాగ్ నివేదికలో స్పష్టంగా వెల్లడైందన్నారు. ఐటీఐఆర్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. పాలనాపరమైన అడుగులు ముందుకు వేయని మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రైల్వే, ఎంఎంటీఎస్, రేడియల్ రోడ్లను అభివృద్ధి చేసినట్లయితే ఐటీఐఆర్ ప్రాజెక్టు కొనసాగించడానికి కేంద్రం సిద్ధంగా ఉండేదని చెప్పారు.
ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి తెరాస నేతలు రోజుకో ఉత్తరం రాస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఇలా చేస్తున్నారన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు ఏర్పాటుకు తెరాస ప్రభుత్వం చేసింది శూన్యమని.. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సహాయ నిరాకరణ చేసిందని లేఖలో సంజయ్ ఆరోపించారు.